వైభవంగా శోభాయాత్ర

13 Sep, 2019 08:57 IST|Sakshi
ఎన్టీఆర్‌ మార్గ్‌లో భక్తజన సందోహం

భక్తజనసంద్రమైన హుస్సేన్‌సాగర్‌  

మధ్యాహ్నానికి పూర్తయిన ‘మహా’ నిమజ్జనం  

సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్‌ తీరం భక్తజనసంద్రమైంది. భక్తుల కేరింతలతో హోరెత్తింది. ‘జైబోలో గణేశ్‌ మహరాజ్‌ కీ’ నినాదాలతో మార్మోగింది. వినాయక నిమజ్జన వేడుకలు గురువారం నగరంలో కనుల పండువగా జరిగాయి. మధ్యాహ్నం ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనోత్సవం ముగిసిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. నగరంలోని అన్ని రహదారులు ట్యాంక్‌బండ్‌ వైపునకు దారితీశాయి. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్‌ జనంతో కిక్కిరిసిపోయాయి. భజనలు, కీర్తనలు, కోలాటాలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అటు ట్యాంక్‌బండ్‌ వైపు, ఇటు ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు ఏర్పాటు చేసిన 40 క్రేన్‌ల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేశారు. వైవిధ్యభరితమైన విగ్రహాలతో ట్యాంక్‌బండ్‌ శోభాయమానంగా కనిపించింది. బాలాపూర్‌ లడ్డూ వేలం ఆలస్యంగా మొదలు కావడంతో  పాతబస్తీ నుంచి వచ్చే ప్రధాన యాత్ర కూడా ఆలస్యమైంది. మొత్తంగా ఒకట్రెండు విషాద ఘటనలు మినహా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.  

వెల్లివిరిసిన సంస్కృతి  
ఖైరతాబాద్‌ ద్వాదశాదిత్య గణపతి నిమజ్జన వేడుకలు ఉదయం 7:13 గంటలకు ఖైరతాబాద్‌ నుంచి మొదలై మధ్యాహ్నం 1:45 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని 6వ నంబర్‌ వద్ద పూర్తయ్యాయి. ఖైరతాబాద్, సెన్సేషన్‌ థియేటర్, రాజ్‌దూత్‌ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తాల మీదుగా సాగిన శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. 61 అడుగుల మహాగణపతి విగ్రహంతో సెల్ఫీ తీసుకొనేందుకు  జనం పోటీ పడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒగ్గుడోలు, బోనాల ప్రదర్శనలు, కళాకారుల ఆటాపాటలతో తెలంగాణ సంస్కృతి  వెల్లివిరిసింది. నిమజ్జనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తోపులాట జరగింది. రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన  బారికేడ్‌లు కూలిపోయాయి. బాలాపూర్‌ లడ్డూ వేలం ఈసారి రెండు గంటలు ఆలస్యం కావడంతో... ప్రతిఏటా మధ్యాహ్నం 2గంటలకే నిమజ్జనం పూర్తవుతుండగా, ఈసారి సాయంత్రం 6 తరువాత జరిగింది. దీంతో మిగతా విగ్రహాల తరలింపు కూడా ఆలస్యమైంది. అబిడ్స్, సుల్తాన్‌బజార్, కోఠి, చోటా బజార్, జియాగూడ, చెప్పల్‌బజార్, లంగర్‌హౌస్, అత్తాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, అంబర్‌పేట్‌ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. 

వెరైటీ గణపతులు...  
వెరైటీ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూషికవాహనుడై, పద్మనాభుడై, యాదాద్రి ఆలయ ఆకృతి అలంకృతుడై, తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు పలు విగ్రహాలను కాషాయ జెండాలు, త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, జీమెయిల్‌ వంటి సోషల్‌ మీడియాను ప్రతిబింబించే విధంగా చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి తీసుకొచ్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాల్లో యువత సందడి ఎక్కువగా కనిపించింది. మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ ప్రయాణికుల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో చిరువ్యాపారుల అమ్మకాలు జోరుగా సాగాయి.  

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర...‘మహా’ శోభాయాత్ర సాగిందిలా..
ఖైరతాబాద్‌: దాదాపు 11 రోజుల పాటు ఖైరతాబాద్‌లో విశేష పూజలందుకున్నశ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన ఊరేగింపు గురువారం ఉదయం 7.13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.45 గంటలకు ముగిసింది. భారీకాయుడుహుస్సేన్‌ సాగర్‌లో ప్రశాంతంగా నిమజ్జనమయ్యాడు. అశేష భక్తజనం వెంట తరలి రాగా 61 అడుగుల ఎత్తులో మహాగణపతి ఊరేగుతూ సాగర తీరానికి తరలివెళ్తున్న దృశ్యాలను భక్తులు సెల్‌ ఫోన్లలో బంధింస్తూ ఆనందం పొందారు.

బుధవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత భక్తుల దర్శనాలు నిలిపివేశారు
11 గంటలకు చిన్న క్రేన్‌ మహాగణపతి ప్రాంగణానికి రాక  
12.30కు విష్ణుమూర్తి విగ్రహాన్ని నిమజ్జనానికి మరో వాహనంపై పెట్టి తరలించారు
12.30కు ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్‌రాజ్, శిల్పి రాజేంద్రన్‌ కలశ పూజ
గురువారం 3.30 నిమిషాలకు మహాగణపతిని పైకి తేల్చి 3.40 గంటలకు ఎస్‌టీసీ ట్రాలర్‌ వాహనంపై చేరిక  
ఉదయం 7.13 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం  
8.30 గంటలకు సెన్షేన్‌ థియేటర్‌
8.55కు రాజ్‌దూత్‌ చౌరస్తా
9.08కు టెలిఫోన్‌ భవన్‌
9.30 గంక్కు ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా
10.43కు తెలుగుతల్లి చౌరస్తా
మధ్యాహ్నం 12.24కు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం.6 వద్దకు మహాగణపతి
12.45లకు మహాగణపతికి చివరి పూజలు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్, సీపీ అంజనీకుమార్‌ పాల్గొన్నారు.  
12.52కు వెల్డింగ్‌ తొలగింపు పనులు  
1.15కు మోడ్రన్‌ క్రేన్‌ అపరేటర్‌ దేవేందర్‌సింగ్‌ పూజలు  
1.21కి మహాగణపతి విగ్రహాన్ని పైకి లేపి నలువైపులా తిప్పి భక్తులకు కనువిందు చేశారు
1.45 గంటలకు మహాగణపతినినిమజ్జనం మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావిస్తామని చెప్పినా చివరి ఘట్టంలో నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా కొంచెం పక్కన నిమజ్జనం చేయడంతో విగ్రహం 80 శాతం మాత్రమే నీటమునింది.

మరిన్ని వార్తలు