తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

25 Jul, 2019 07:47 IST|Sakshi
మాట్లాడుతున్న ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌

కలెక్టర్‌ కారును అడ్డుకున్న పోడుసాగుదారులు

కారేపల్లి: సింగరేణి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అర్‌వీ కర్ణన్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలతో సమావేశమయ్యారు. మండలంలో రెవెన్యూ సమస్యలు, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ, సాదాబైనామాల పరిస్థితి సమీక్షించారు. సమావేశం అనంతరం కార్యాలయం వెలుపలికి వచ్చిన కలెక్టర్‌కు బాధితులు భారీగా వినతులు సమర్పించారు. గిరిజనేతరులతో పాటు గిరిజనుల భూములకు పట్టాలు కావడం లేదని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనేతరులు 1970కు ముందు రెవెన్యూ రికార్డుల్లో ఉండాలని, గిరిజనులు ఏ సమయంలోనైనా రికార్డుల్లో ఉంటే వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. వారసత్వ పట్టాలకు తప్పని సరిగా కుటుంబం అంతా కలిసి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టా కల్పిస్తారని చెప్పారు.  

పోడుదారుల బైఠాయింపు 
హక్కు ఉన్నా పోడును సాగు చేయనీయకుండా ఫారెస్టు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పాటిమీదిగుంపునకు చెందిన పోడు మహిళా రైతులు తిరుగు ప్రయాణం అయిన కలెక్టర్‌ కారు ముందు బైఠాయించారు. సెక్యూరిటీ సిబ్బంది మహిళలను కలెక్టర్‌ వద్దకు తీసుకువెళ్లగా వారు తమ సమస్యను విన్నవించారు. హక్కు పత్రాలు ఉన్నాయని పత్రాలను కలెక్టర్‌కు చూపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఎఫ్‌బీఓపై ఫిర్యాదు చేయాలని సూచించారు.

కలెక్టర్‌ దృష్టికి పలు సమస్యలు.. 
తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌కు పలు సమస్యలను సర్పంచ్, ప్రజా సంఘాల నాయకులు వివరించారు. కారేపల్లిలో ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని, గుర్తించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని సర్పంచ్‌ ఆదెర్ల స్రవంతి విన్నవించారు. పోడు సాగుదారుల సమస్యపై ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర నాయకుడు అజ్మీర శివనాయక్‌ వినతిపత్రం సమర్పించారు. కారేపల్లిలోని పోలీస్‌ క్వార్టర్‌ ప్రాంత మినీ అంగన్‌వాడీ కేంద్రం భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, దాని నిర్మాణానిక్రి పభుత్వ భూమి కేటాయించాలని సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు తురక నారాయణ వినతిపత్రం అందజేశారు. 

మరిన్ని వార్తలు