సమస్యను వారంలో పరిష్కరిస్తాం 

27 Jul, 2019 07:32 IST|Sakshi
బాలికలతో మాట్లాడుతున్న డీఈఓ మదన్‌మోహన్‌

డీఈఓ పి.మదన్‌మోహన్‌

కొణిజర్ల: ఏన్కూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను వారంరోజుల్లో పరిష్కరిస్తానని జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్‌మోహన్‌ అన్నారు. బాలికలు సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గ్రహించిన డీఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల మరుగుదొడ్లు, నీటి వసతులను ఆయన పరిశీలించారు. బాలికలతో మాట్లాడారు. వంట శాల పరిశీలించి బాలికలకు అమలు చేస్తున్న మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ఏన్కూర్‌ కస్తూర్బాలో బాలికల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని వినియోగంలో లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని వారం రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పాఠశాలలో సమస్యలపై టీఎస్‌ ఎడ్యుకేషనల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి తెలియజేశామని, వారు పాఠశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 471 వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని, వారిలో గతేడాది పని చేసిన 413 మందిని రెన్యూవల్‌ చేసినట్లు చెప్పారు. పిల్లల సంఖ్యను బట్టి ఎంఈఓల నుంచి నివేదిక తెప్పించుకుని ఖాళీలను భర్తీ చేస్తామని, ఈ ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్‌ తరగుతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

కొత్తగా 9 పాఠశాలల్లో సిబ్బంది నియామకాలు చేపడుతున్నామన్నారు. ఇంటర్‌లో బాలికలు అదనంగా వచ్చి చేరడం వల్ల సమస్య ఏర్పడుతుందని, ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం విద్యార్థులను ఏ బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా చేసి చదివిస్తామని, సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రత్యేకంగా మెటీరియల్‌ తయారు చేయించి పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8,500 మంది విద్యార్థులు చేరారని, ఎక్కడ మౌలిక వసతుల కొరత ఉందో అక్కడ నిధులు కేటాయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంఈఓ జయరాజు, ఎస్‌ఓ సంతు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు