ఖమ్మం టు జమ్మికుంట

4 Nov, 2017 13:58 IST|Sakshi

జమ్మికుంట: ఒక రైతుకు లారీ పత్తి పండిందంటే ఎవరైనా నమ్ముతారా.. అసలుకు నమ్మరు.. అకాల వర్షాలతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ట్రాలీల్లో తప్ప లారీ నిండా పత్తి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలోనూ జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులు లారీ పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చిన రైతులంతా పత్తి లారీని చూసి వామ్మో ఇంత పంట పండిందా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామాల్లో రైతుల వద్ద నేరుగా తక్కువ ధరలు చెల్లించి అదే పత్తిని ఎక్కువ ధరలకు మార్కెట్లోకి అమ్మకానికి తీసుకొచ్చారనేది తెలుసుకోలేకపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు లారీల్లో పత్తి రాక మొదలైందంటే చాలు దళారులంతా గ్రామాల్లో మాయమాటలు చెప్పుతూ తక్కువ ధరలకు కొనుగోలు దందా చేపట్టినట్లు తెలిసిపోతోంది. 

జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ జిల్లా, వరంగల్‌ రూరల్‌. ఖమ్మం, మహబుబ్‌నగర్‌ జిల్లాల నుంచి ప్రతీ సీజన్‌లో దళారులంతా గ్రామాల్లో ఇళ్ల వద్ద కాంటాలు పెట్టి రైతుల వద్ద క్వింటాల్‌ పత్తికి రూ.3000 నుంచి 3300 వరకు ధరలు చెల్లించి దందా సాగిస్తుంటారు. తూకాల్లో భారీగా  మోసాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం అకాల వర్షాలతో అల్లాడుతున్న పత్తి రైతులు చేతికి వచ్చిన పత్తిని మార్కెట్‌లో తక్కువ ధరలకు అమ్మకాలు జరుపుకుంటున్నారనే ప్రచారం రైతుల్లో మొదలు కావడంతో దళారులు రంగంలోకి దిగి రైతులను మరింత ముంచేందుకు కొనుగోళ్లు షూరు చేసినట్లు తెలుస్తోంది.

 ఈ ప్రాంతానికి చెందిన దళారులు సైతం గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఇళ్ల ముందు వ్యాపారం సాగిస్తూ లారీల కొద్ది పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రేడర్స్‌ లైసెన్స్‌ ఉంటే తప్ప ఎక్కడా రైతుల వద్ద పత్తి కొనుగోలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. రైతు రూపంలో మార్కెట్‌లోకి అడుగు పెడుతుండడం విశేషం.  

మరిన్ని వార్తలు