పుంజుకుంది..!

25 Apr, 2019 06:49 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ ఆదాయం స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఆదాయం రూ.27.41కోట్లు కాగా.. ఈ ఏడాది 27.66కోట్లకు చేరింది. జిల్లాలో ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉండగా.. వీటి పరిధిలో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిర్వహించే వ్యాపారుల నుంచి మార్కెట్‌ ఫీజు(1 శాతం) వసూలు చేస్తారు. మార్కెటింగ్‌ శాఖ 2018–19 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఆదాయ లక్ష్యాన్ని రూ.33.10కోట్లుగా నిర్దేశించింది. అయితే ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం సాధారణం కన్నా కొంత మేర తగ్గింది.

తగ్గిన సాగు విస్తీర్ణం ప్రభావం మార్కెట్ల ఆదాయంపై కొంత ప్రభావం చూపింది. జిల్లాలో రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది అనుకూలించని వర్షాలు.. తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా పత్తి దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లకు మించలేదు. మిర్చి కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఆదాయం కొంత మేరకు పుంజుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఆదాయ లక్ష్యం రూ.29.49కోట్లు కాగా.. రూ.27.41కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఆ ఆదాయం కొంత పుంజుకొని రూ.27.66కోట్లకు చేరింది.
 
ఆదాయంపై ప్రభావం చూపిన సాగు 
జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఆదాయంపై పంటల సాగు ప్రభావం చూపింది. ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణ లక్ష్యం 2,32,707 హెక్టార్లు కాగా.. 2,12,729 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తంగా 91.4 శాతం మాత్రమే పంటలను సాగు చేశారు. పత్తి, మిర్చి పంటలు సాగు లక్ష్యాన్ని చేరుకోలేదు. పత్తి 97,862 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా.. 96,701 హెక్టార్లలో, మిర్చి 19,828 హెక్టార్లు కాగా.. 18,067 హెక్టార్లలో సాగు చేశారు. అంటే.. ఈ రెండు పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి.

మొక్కజొన్న, కంది, వేరుశనగ, చెరకు వంటి పంటల సాగు కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. సాగు చేసిన పంటల నుంచి ఆశించిన విధంగా పంట దిగుబడులు రాలేదు. పత్తి దిగుబడులు బాగా పడిపోగా, మిర్చి దిగుబడులు కూడా తగ్గాయి. పండించిన మిర్చి సగటున రూ.8,500 ధర పలుకుతోంది. ఈ ధర రూ.10వేల మార్క్‌ దాటితే మార్కెట్‌ ఆదాయం మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇక రబీ పంటలకు సాగర్‌ నీటిని విడుదల చేయలేదు. రబీ సాగు విస్తీర్ణ లక్ష్యం 53,620 హెక్టార్లు కాగా.. కేవలం 33,590 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఈ ప్రభావం కూడా మార్కెట్‌ ఆదాయంపై చూపింది.

పంట ఉత్పత్తులపైనే.. 
పంటల సాగు, దిగుబడులపైనే మార్కెట్ల ఆదాయం ఆధారపడుతుంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అంతేకాక దిగుబడులు కూడా అంత ఆశాజనకంగా లేవు. ఆశించిన మేర పత్తి దిగుబడులు రాకపోవడంతో మార్కెట్ల ఆదాయంపై ప్రభావం చూపింది. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ల ఆదాయం కొంత మేర పెరిగింది. రబీ పంట ఉత్పత్తులు లేకపోవడం కూడా మార్కెట్‌ ఆదాయంపై ప్రభావం చూపింది.  – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

మరిన్ని వార్తలు