‘నకిలీ’ దందా !

7 Jun, 2019 13:19 IST|Sakshi

బూర్గంపాడు: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈ విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో వేలాది నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టుబడుతున్నాయి. జిల్లాలో నిషేధిత బీజీ–3, గ్లైసిల్‌ బీటీ పత్తి విత్తనాలు దొడ్డిదారిన సరఫరా అవుతున్నట్లు   టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో తేటతెల్లమవుతోంది. టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు విత్తన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా బీజీ–3, గ్లైసిల్‌ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ దాడులు జరుగుతుండడంతో నకిలీ విత్తన వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... 
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశాలున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు విత్తన వ్యాపారులు..  ప్రభుత్వం నిషేధించిన బీజీ–3, గ్లైసిల్‌ బీటీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మే నెల మొదటి వారంలోనే నకిలీ విత్తనాలు జిల్లాకు సరఫరా అయ్యాయి. వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచి, రైతుల అవసరాలను బట్టి ప్యాకింగ్‌ చేయించి విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాలను రైతులకు నమ్మకం కలిగేలా అత్యంత పకడ్బందీగా ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు వాడితే పురుగు మందులు కొట్టే పని ఉండదని, ఒకవేళ చేలో కలుపు పడితే నిరభ్యంతరంగా గడ్డిమందు కొట్టుకోవచ్చని, పత్తి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులను నమ్మిస్తున్నారు.

దీంతో కొందరు రైతులు వారి మాటలు నమ్మి ఈ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది నకిలీ విత్తన ప్యాకెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పోలీసులు, వ్యవసాయశాఖ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 3వేలకు పైగా నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. జిల్లాలో 15 మంది వ్యాపారులపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్‌ దాడులతో అప్రమత్తమైన అక్రమ వ్యాపారులు తమ వద్దనున్న నకిలీ విత్తనాలను రహస్య ప్రాంతాలకు తరలించారు. కొత్తగూడెం, భద్రాచలం డివిజన్‌లలోని అనేక మండలాల్లో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యాయి. ఈ సమాచారంతో వ్యవసాయ, పోలీస్‌శాఖలు అప్రమత్తమై సంయుక్తంగా దాడులు  నిర్వహిస్తున్నారు. ఈ దాడులను ఇంకా విస్తృతం చేయాలని రైతులు కోరుతున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమయానికి ముందే విక్రయాలు... 
జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. ఎండలు మండిపోతున్నాయి. విత్తనాలు వేసేందుకు ఏ మాత్రం అనువైన వాతావరణం లేదు. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం గత పది రోజుల నుంచే గుట్టుచప్పుడు కాకుండా రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన కొందరు రైతులు తొలకరికి ముందే పొడి దుక్కుల్లో వేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోతే వేసిన విత్తనాలు నష్టపోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్లీ విత్తనాల కోసం పరుగులు తీస్తే నకిలీ విత్తనాలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది.

జిల్లాలో ఇప్పటివరకు ఇప్పటి వరకు పత్తి విత్తనాల విక్రయాలకు వ్యవసాయశాఖ అనుమతులు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు ఖమ్మం నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. దీంతో స్థానిక విత్తన డీలర్లు తమ వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో తమకు నమ్మకమైన రైతులకు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా విత్తనాలను విక్రయిస్తున్నారు. ఇప్పటికే  భద్రాచలం డివిజన్‌లో 25 శాతం మేర  విత్తనాల విక్రయాలు జరిగాయి. సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి గింజలు వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు రైతులు విత్తనాలు వేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంది. విత్తన విక్రయాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.

ప్రత్యేక నిఘా పెడుతున్నాం 
నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి పంపించి నకిలీ విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టాం. రైతులు కూడా వర్షాలు పడిన తరువాతే విత్తనాలు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ అనుమతులు రాకుండా విత్తనాలు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌రావు, ఏడీఏ, మణుగూరు

మరిన్ని వార్తలు