సత్తుపల్లి సపరేటే..

8 Jan, 2020 08:52 IST|Sakshi
సత్తుపల్లి మున్సిపల్‌ కార్యాలయం 

సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం​): సత్తుపల్లి పట్టణ ఓటర్‌ తీర్పు విలక్షణంగా ఉంటుంది.. పట్టణ రాజకీయాలు ఎప్పటికప్పుడు వాడీవేడిని పుట్టిస్తుంటాయి.. అధికార పార్టీ హవా నడుస్తున్నా.. నిశ్శబ్ద తీర్పుతో ముచ్చెమటలు పట్టించిన చరిత్ర ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికే గుండెకాయలాంటి మున్సిపాలిటీ ఓటరు తీర్పుపై అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరకంగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరో రకంగా.. పంచాయతీ ఎన్నికల్లో ఇంకో రకంగా విలక్షణంగా ఓటు వేయడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత. సత్తుపల్లి పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు సునాయసనమని రాజకీయ పార్టీలు అంచనా వేస్తారు. సత్తుపల్లి మున్సిపాలిటీ అధికారం చేతిలో ఉంటే సగం పాలన ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు.

ఓటరు ఎదురు తిరిగితే..
సత్తుపల్లి పట్టణ ఓటర్ల తీర్పు అధికార పార్టీకి భిన్నంగా ఇవ్వడం.. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోవడం లాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు అధికారం చలాయించే సమయంలో జరిగిన 1992 ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండేది. అప్పుడు జరిగిన సొసైటీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన సీనియర్‌ నేతలు రంగంలోకి దిగి పోటీ చేయడం ఆ ప్యానల్‌ ఘన విజయం సాధించటం టీడీపీకి బలాని్నచి్చనట్‌లైంది. తర్వాత జరిగిన పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు విజయానికి బాట వేసినట్లయింది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా అధికారం శాసిస్తున్న సమయంలో 2001లో జరిగిన సత్తుపల్లి పంచాయతీ ఎన్నికల్లో అధికార టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొత్తూరు ప్రభాకర్‌రావును కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోటగిరి మురళీకృష్ణారావు ఓడించి సంచలనం సృష్టించారు.

2001లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా సత్తుపల్లి పట్టణంలోని ఆరు ఎంపీటీసీలకు నాలుగు ఎంపీటీసీలు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకొని సంచలన విజయం నమోదు చేసింది. తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు జలగం వెంకటరావు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సత్తుపల్లి పట్టణ ఓటర్ల విలక్షణమైన తీర్పుతోనే రాజకీయ పీఠాలు కదిలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. 

2009 నుంచి..
సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మూడో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి పట్టణ ఓటర్ల మొగ్గుతోనే విజయం సాధిస్తున్నారు. 2009, 2019 ఎన్నికల్లో సత్తుపల్లి పట్టణ ఓటర్లు సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా నిలవడంతో మంచి మెజార్టీ లభించింది. 2014 ఎన్నికల్లో స్థానికుడైన మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయటంతో సత్తుపల్లి పట్టణ ఓటర్లు ఆయనకు మద్దతు ఇవ్వటంతో సండ్ర వెంకటవీరయ్యకు మెజార్టీ పడిపోయింది. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 17 వార్డులు గెలుచుకున్నారు. ఈ సారి ఓటర్లు ఏం తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే. 

పంచాయతీ సర్పంచ్‌లు వీరే..
సత్తుపల్లి పంచాయతీ ఏర్పడినప్పుడు తొలి సర్పంచ్‌గా మొరిశెట్టి రాజయ్య (1961–66), గాదె నర్సయ్య(1966–1970), అనుమోలు నర్సింహారావు (1970–83), కొత్తూరు ప్రభాకర్‌రావు (1983–88), కోటగిరి మురళీకృష్ణారావు (1988–95), కొత్తూరు పార్వతి (1995–2001), కోటగిరి మురళీకృష్ణారావు (2001–2005)లు సర్పంచ్‌గా పని చేశారు. 

నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా..
2005 సత్తుపల్లి నగరపంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత ఎస్టీ జనరల్‌కు చైర్మన్‌ పదవి రిజర్వ్‌ అయింది. తొలి చైర్‌పర్సన్‌గా పూచి యశోద (2005–2010) ఎన్నికయ్యారు. రెండోసారి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. చైర్‌పర్సన్‌గా దొడ్డాకుల స్వాతి (2014–2019) ఎన్నికయ్యారు. మూడోసారి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయి ఎన్నికలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు