వైరా ‘పుర’ రాజకీయం

8 Jan, 2020 09:06 IST|Sakshi

సాక్షి, వైరా: మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుండటంతో వార్డుల రిజర్వేషన్లు, అభ్యర్థుల గుర్తింపు, వార్డుల వారీగా బాధ్యతలు తదితర అంశాలపై ఆయా పార్టీల నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎలాగైనా గెలవాలనే తపన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళదాం? వార్డుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రిజర్వేషన్లను బట్టి అభ్యర్థులు ఎవరు? ఈ అంశాలపై పార్టీలు జోరుగా చర్చలు సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతల ఇళ్ల ముందుకు కార్యకర్తలు, ఆశావాహుల హడావుడి ఎక్కువైంది. వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. వైరా మున్సిపాలిటీ 20 వార్డుల్లో 23,226 మంది ఓటర్లు ఉన్నారు. వైరా గతంలో మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉండటంతో అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 2013లో సర్పంచ్‌గా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్రం విడిపోవటం, 2018లో వైరా మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవడంతో రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. తొలిసారి జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 

ఎన్నికలకు బలాబలాలు..
మొట్టమొదటిసారి జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు అధికార టీఆర్‌ఎస్‌ ఆరునెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది. మండలస్థాయి నేతలకు స్థానిక ఎమ్మెల్యే లావూడ్యా రాములునాయక్‌ ఎప్పటికప్పుడు సూచనలిస్తూ సమాయత్తం చేశారు. ఇప్పటికే వైరా నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి.. స్వతంత్ర అభ్యర్థి అయిన లావూడ్యా రాములునాయక్‌ గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, అదే స్వతంత్ర అభ్యర్థి తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ బలం పుంజుకుంది. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ హవానే కొనసాగింది. ప్రతి పక్ష పార్టీ నుంచి అదేస్థాయిలో వలసలు కూడా పెరగడంతో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ రానున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. మున్సిపాలిటీలో విలీనమైన కొణిజర్ల మండలంలోని పల్లిపాడు, దిద్దుపుడి, లాలాపురం గ్రామాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆశించినస్థాయిలో బలం లేకపోయినప్పటికీ అక్కడి నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలంతా టీఆర్‌ఎస్‌లో చేరటంతో అక్కడ  కూడా పార్టీకి బలం చేకూరింది. మండలంలోని సోమవరం, గండగలపాడు, బ్రాహ్మణపల్లి ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ బలపడింది. 

ప్రతి పక్ష పార్టీల పరిస్థితి ఇలా..
2013లో మేజర్‌ గ్రామం పంచాయతీ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన స్థాయిలో వార్డు సభ్యులు గెలుపొందలేదు. ఉన్న రెండు మూడు వార్డుల వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. అయినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఎం) కూడా సత్తా చాటేందుకు కసరత్తు ప్రారంభించాయి. గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులు, స్థానికులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులను పోటీకి దించితే గెలిచే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీలకు కూడా ఓటు బ్యాంక్‌ ఉందని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందని, దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటామని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు చెబుతున్నారు.

విలీన గ్రామాల్లో పరిస్థితి..
2013లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి గెలుపొందగా, ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. సీపీఎం ఆ గ్రామంలో బలంగా ఉంది. వార్డు కౌన్సిలర్‌ ఎన్నికలో ప్రభావం చూపనుంది. పల్లిపాడు సర్పంచ్‌ కూడా టీడీపీ నుంచి గెలుపొందినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అక్కడి నాయకులంతా అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. దిద్దుపూడి గ్రామ సర్పంచ్‌గా సీపీఐ నుంచి గెలుపొందారు. అక్కడి నాయకత్వం అంతా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే, దిద్దుపూడి గ్రామంలో గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా పురపాలక ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడిక్కిందని చెప్పవచ్చు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు