‘ఖని’లో నయీం అనుచరుడికి గుండెపోటు

27 Jun, 2016 02:22 IST|Sakshi
‘ఖని’లో నయీం అనుచరుడికి గుండెపోటు

స్థానికంగా చికిత్స  
హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు ప్రచారం

 
కరడుగట్టిన నేరస్తుడు నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యాడు. గోదావరిఖనికి వచ్చిన ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది.  - గోదావరిఖని

 
గోదావరిఖని : మావోయిస్ట్ ఉద్యమ వ్యతిరేక నాయకుడు నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఉన్న మిత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు కోరుకంటి చందర్, పెంట రాజేశ్‌ను ఆదివారం మధ్యాహ్నం స్థానిక అడ్డగుంటపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద శ్రీనివాస్ కలుసుకున్నాడు. అయితే ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు స్థానికంగా ఉన్న మమత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. శ్రీనివాస్‌కు బీపీ, షుగర్ అధికంగా ఉండడంతోపాటు ఛాతి నొప్పి ఎక్కువగా ఉండి మాట్లాడలేని పరిస్థితికి చేరడంతో డాక్టర్ భరణి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు.

ఆసుపత్రిలో పదినిమిషాల పాటు మాత్రమే ఉన్న శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. అయితే కరీంనగర్‌లో చికిత్స చేసుకుంటే తాము వస్తామని మిత్రులు తెలపగా...తాను హైదరాబాద్‌లోనే చికిత్స చేసుకుంటానని చెప్పడంతో తాము ఇక్కడే ఆగిపోయామని కోరుకంటి చందర్, పెంట రాజేశ్ తెలిపారు.


శ్రీనివాస్‌ను హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. పాశం శ్రీనివాస్ 2004 నుంచి 2009 వరకు భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పనిచేశాడు. అంతకుముందు శ్రీనివాస్ ఇంటి పక్కనే ఉండి కోరుకంటి చందర్, పెంట రాజేశ్ అక్కడి కళాశాలలో పాలిటెక్నిక్ చేయడంతో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. 2009 నుంచి నయీం ముఠాలో చేరగా....మావోయిస్ట్ నేత సాంబశివుడు సోదరుడు రాములు హత్య కేసులో శ్రీనివాస్ రెండో నిందితుడుగా ఉన్నాడు. రెండు నెలల క్రితం శ్రీనివాస్‌పై పీడీ యాక్టు కింద కేసు నమోదు కావడంతో ఆనాటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులకు లొంగిపోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుండగా...తన మిత్రులను కలవడానికి వచ్చిన శ్రీనివాస్ గుండెపోటుకుగురయ్యాడు.

మరిన్ని వార్తలు