వరి.. సగానికే సరి

17 Aug, 2017 02:20 IST|Sakshi
  • వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి..
  • నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు
  • ఇప్పటివరకు నాట్లు వేసిన విస్తీర్ణం     53%
  • లోటు వర్షపాతం నమోదైన మండలాలు    235
  • సాక్షి, హైదరాబాద్‌
    రాష్ట్రంలో వరి నాట్లు పుంజుకోవడంలేదు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 12.35 లక్షల ఎకరాల్లో (53%) మాత్రమే నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వర్షాధార పంటలకే ప్రయోజనం కలిగిస్తున్నాయని, వరి నాట్లు వేయడానికి ఏమాత్రం సహకరించే పరిస్థితి కనిపించడంలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

    ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 86.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 44.72 లక్షల ఎకరాల్లో (107%) సాగు కావడం విశేషం. అన్ని పంటల సాగు విస్తీర్ణంలో సగానికిపైగా పత్తి సాగు కావడం గమనార్హం. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.85 లక్షల ఎకరాల్లో (84%) సాగయ్యాయి.

    సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.8 లక్షల ఎకరాలు కాగా, 4.02 లక్షల ఎకరాల్లో (69%) సాగైంది. మిర్చి సాగు మాత్రం పుంజుకోలేదు. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.70 లక్షల ఎకరాలు కాగా, 12,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కేవలం 8 శాతమే మిర్చి సాగు చేశారు. గతేడాది మిర్చి ధర భారీగా పతనమవడంతో ఈసారి రైతులు అటువైపుగా ఆసక్తి కనబర్చడంలేదు.

    రెండు జిల్లాల్లోనే అధికం..
    రుతుపవనాలు అనుకున్నంత స్థాయిలో చురుగ్గా లేకపోవడంతో వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 486.4 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 410.6 మి.మీ. కురిసింది. 15.6 శాతం లోటు నమోదైంది. జులైలో 40 శాతం లోటు నమోదైంది. రాష్ట్రంలోని జోగులాంబ, హైదరాబాద్‌ జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో సాధారణం, 12 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. మండలాల వారీగా చూస్తే 78 మండలాల్లో అధికం, 269 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 235 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. 2 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

    నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు
    రుతుపవనాలు ఊపందుకోవడంతో గురువారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో ములుగులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

    ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్‌కు ప్రయోజనం: పార్థసారథి
    సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌ పంటలను బలోపేతం చేశాయని, రైతుల్లో ఉత్సాహాన్ని నింపాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎరువుల అవసరాలు, అందుబాటులో ఉన్న ఎరువుల స్థితిగతులపై బుధవారం వ్యవసాయ కమిషనర్‌ జగన్‌ మోహన్, హాకా, మార్క్‌ ఫెడ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. యాసంగి పంటలకు విత్తనాలు, ఎరువుల అవసరాలు, క్షేత్రస్థాయిలో వాటి అందుబాటుకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశించారు.

మరిన్ని వార్తలు