ఆగమాగం

8 May, 2014 04:04 IST|Sakshi

నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ :  2010 ఖరీఫ్ నుంచి 2013 ఖరీఫ్‌తో పాటు రబీ వరకు వరుసగా నాలుగున్నరేళ్లుగా పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. కరువు, తుపాను, వరదలు, వడగండ్లు, భారీ వర్షాల రూపంలో ప్రకృతి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
 
 దీంతో వేల కోట్ల రూపాయల మేరకు రైతులు నష్టాలపాలయ్యారని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. 2010 సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వచ్చిన భారీ వర్షాల కారణంగా లక్షల హెక్టార్లలో పత్తి, వరి, కంది, పండ్ల తోటలకు నష్టం జరిగి సుమారు రూ.1000 కోట్ల మేరకు నష్టం జరిగింది. అదేవిధంగా 2011 ఖరీఫ్‌లో వచ్చిన కరువు కారణంగా లక్షా 51 వేల హెక్టార్లలో పత్తి, 52,808 హెక్టార్లలో వ రి, 12, 594 హెక్టార్లలో కంది పంటలు కలిపి మొత్తం 2,16,402 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 3లక్షల 82వేల మంది రైతులు సుమారు రూ.1500 కోట్ల మేర నష్టపోయారు.  2012 ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన కరువు కారణంగా పత్తి 81వేల హెక్టార్లు, వరి 1157 హెక్టార్లు కలిపి మొత్తం 82,157 హెక్టార్లలో పంటలు దెబ్బతిని లక్షా 10 వేల మంది రైతులకు సుమారు రూ. 800 కోట్ల మేరకు నష్టాలపాలయ్యారు.
 
 అదే సంవత్సరం నవంబర్‌లో వచ్చిన నీలం తుపాను కారణంగా వెయ్యి హెక్టార్లలో 1200 మంది రైతులకు చెందిన వరిపంట దెబ్బతిని సుమారు రూ.5 కోట్ల మేరకు నష్టం జరిగింది. 2013 ఖరీఫ్‌లో వచ్చిన పైలీన్ తుపాను కారణంగా జిల్లాలో భారీ నష్టాన్ని కలిగించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షా 70వేల హెక్టార్లలో పత్తి, 40 వేల హెక్లార్లలో వరి పంటలు దెబ్బతిని లక్షల మంది రైతులు సుమారు రూ.1500 కోట్ల మేరకు నష్టాల పాలయ్యారు. పైలీన్ నష్టాలను మరవకమందే మరో హెలెన్ తుపాను రూపంలో వచ్చిన వర్షాల కారణంగా సుమారు వెయ్యి హెక్టార్లలో వరిపంటలు దెబ్బతిని  రైతులకు  రూ.మూడు కోట్ల మేరకు నష్టాలపాలు చేసింది.
 
 రబీలోనూ అదే పరిస్థితి
 ప్రస్తుత రబీలో కూడా ప్రకృతి అన్నదాతపై కన్నెర్ర చేసింది. వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. వరుసగా మార్చి నెలలో వచ్చిన అకాల వర్షాల కారణంగా చివ్వెంల, ఆత్మకూరు(ఎస్), సూర్యాపేట, చిట్యాల, శాలిగౌరారం, కేతేపల్లి, రామన్నపేట, చౌటుప్పల్ మండలాలలో వరిచేలు దెబ్బతిన్నాయి. సుమారు 520 హెక్టార్లలో వరిపంటలు దెబ్బతిని సుమారు రూ.52 లక్షల మేరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మే 3,4 తేదీలలో జిల్లాలో కురిసిన అకాల వర్షం కారణంగా భువనగిరి, ఆలేరు, బీబీనగర్, సూర్యాపేట, చిట్యాల, నూతన్‌కల్, తుంగతుర్తి, అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్), వేములపల్లి, కేతేపల్లి, దేవరకొండ, చింతపల్లి, మోతె మండలాల్లో సుమారు 950 హెక్టార్లలో కోతకొచ్చిన వరిచేలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. సుమారు రైతులకు రూ.6కోట్లకు పైగా నష్టం జరిగిందని నివేదికను రూపొందించారు.
 
 అన్నదాతను ప్రభుత్వం ఆదుకున్నదెంత
 వేలాది రూపాయలను నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. వేల కోట్లలో నష్టపోతే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో రూ.వందల కోట్లలో మాత్రమే పరిహారం చెల్లించడం విశేషం.
 

>
మరిన్ని వార్తలు