ఖరీఫ్‌ సాగు 52 లక్షల ఎకరాలు

12 Jul, 2018 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల సాగు 49 శాతానికి చేరింది. ఖరీఫ్‌ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 56.74 లక్షల ఎకరాలు సాగు కావడం గమనార్హం. అంటే గతేడాది కంటే కాస్త తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. సాగైన పంటల్లో అత్యధికంగా పత్తి విస్తీర్ణమే ఉండటం గమనార్హం.

పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 30.30 లక్షల ఎకరాల్లో సాగు చేయడం గమనార్హం. కంది సాధారణ సాగు విస్తీర్ణం ఇప్పటివరకు 5.64 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న ఇప్పటివరకు 5.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన ఖరీఫ్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో నార్లు పోశారు. ఆగస్టులో వరి నాట్లు పుంజుకోనున్నాయి.   

మరిన్ని వార్తలు