ఖరీఫ్‌ @ 93 లక్షల ఎకరాలు!

31 Aug, 2017 03:00 IST|Sakshi
ఖరీఫ్‌ @ 93 లక్షల ఎకరాలు!

అందులో సగం పత్తి పంటే
► 46.52 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పత్తి
► 30 శాతం తగ్గిన వరి సాగు
► వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి
► తాజా వర్షాలతో పెసరకు నష్టం
► వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు


సాక్షి, హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు 93.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో కేవలం ఒక్క పత్తి సాగే సగం ఉండటం గమనార్హం. ఏకంగా 46.52 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. గతేడాది పత్తికి గణనీయమైన ధర రావడంతో రైతులంతా ఆ పంట సాగు వైపు మొగ్గారు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 26 రకాల పంటలన్నీ కలిపి 86 శాతం సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, 111 శాతం సాగు జరిగింది. మొత్తం అన్ని పంటల సాగులో ఆహార ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, 38.27 లక్షల ఎకరాల్లో (79%) సాగయ్యాయి.

అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, 16.67 లక్షల (71%) ఎకరాలకే పరిమితమైంది. ఇటీవల వర్షాలతో కాస్తంత పుంజుకున్నా నాగార్జునసాగర్‌ కింద వరి ఆయకట్టు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.20 లక్షల (87%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇక సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.12 లక్షల (71%) ఎకరాల్లో సాగైంది.  

8 జిల్లాల్లో లోటు వర్షపాతం
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. మొత్తంగా 8 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదుకాగా, 3 జిల్లాల్లో అధికం, 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. మేడ్చల్, హైదరాబాద్, గద్వాల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు వచ్చే నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  

కోత దశలో పెసర.. వర్షంతో నష్టం
తాజాగా కురిసిన వర్షాలకు చాలా జిల్లాల్లో కోత దశలో ఉన్న పెసర పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో నష్టం వాటిల్లిన పంటలకు పరిహారం ఇవ్వాలని జిల్లాల నుంచి రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫోన్‌ చేసి పరిహారం కోరుతూ విన్నవించినట్లు తెలిసింది.

రైతులు బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నష్టపరిహారం వస్తుందని, లేకుంటే అవకాశం లేదని అంటున్నారు. వాస్తవంగా ఈ ఖరీఫ్‌లో పెసర 2.22 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగిందనే విషయంపై అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టి పీడిస్తోంది. కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నల్లగొండ, సిరిసిల్ల, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పురుగు కనిపిస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు