కోటి ఆశలతో  

10 Jun, 2019 12:12 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలకరి పలకరింపుతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కోటి ఆశలతో ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే దుక్కులు సిద్ధం చేసుకుంటున్న దృశ్యాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముందో అంచనా వేసిన ఆ శాఖ అధికారులు.. దీనికి అనుగుణంగా ఆయా పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. గతేడాది తరహాలోనే ఈ సీజన్‌లోనూ 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను వాణిజ్య పంటైన పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు సుమారు 26 వేల క్వింటాళ్లు అవసరమవుతాయని లెక్కగట్టారు.
 
సబ్సిడీపై విత్తనాలు సిద్ధం 
పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు రైతులకు సబ్సిడీ లభిస్తున్నాయి. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధరలో మార్పులు ఉంటాయి. సోయాబీన్‌ క్వింటా ధర రూ.6,150 కాగా.. సబ్సిడీపై రూ.2,500 లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150, రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు అధికారుల వద్దకు చేరుకున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్‌ఎస్‌కే), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ (డీసీఎంఎస్‌) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు తీసుకోవచ్చు. రైతు ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. ఏఈఓలు ఆన్‌లైన్‌లో జనరేట్‌ చేసిన టోకెన్‌ను రైతులు అందిస్తే సమీపంలోని పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల్లో ఇచ్చి విత్తనాలు కొనుగోలు చేయవచ్చు.
 
పత్తి విత్తనాల ధర ఇలా.. 
ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. 

15 రోజుల్లో ఎరువులు 
ఈ సీజన్‌లో సాగయ్యే పంటలకు సుమారు 1.03 లక్షల టన్నుల వివిధ రకాల రసాయనిక ఎరువులు అవసరం. రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారు. వీటిని ఇప్పటికే రైతలకు అందుబాటులో ఉంచారు.

మరిన్ని వార్తలు