ధాన్యం నిల్వకు జాగేదీ?

20 Aug, 2018 12:27 IST|Sakshi

కరీంనగర్‌సిటీ: జిల్లాలో రబీలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. ఇప్పటికే రైస్‌ మిల్లులు, గోదాముల్లో రబీ ధాన్యం, బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా కస్టమ్‌ మిల్లింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గోదాముల్లో సామర్థ్యానికి సరిపడా నిల్వలు పేరుకుపోయి ఖాళీ లేకపోవడం.. బియ్యం తరలించేం దుకు రైల్వే ర్యాకులు రాకపోవడం వెరసి ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికితోడు తమిళనాడు రాష్ట్రంతో  తెలంగాణ రా ష్ట్రం ఒప్పందం చేసుకున్నట్లు రైతుల నుంచి అదనంగా కొనుగోలు చేసుకున్న వడ్లను మరాడించి సిద్ధం చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో అమ్మకానికి అనుమతించకపోవడం మిల్లర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫలితంగా ఖరీఫ్‌ సీజన్‌లో వచ్చే ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. 
వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఏటా ప్రభుత్వం ఖరీఫ్‌ మార్కెట్‌ సీజన్‌గా భావిస్తోంది. ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్‌పరంగా ఖరీఫ్‌ సీజన్‌గానే పేర్కొంటోంది. అక్టోబరు ఆరంభం నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ వరకు ఈ సీజన్‌ ఉంటుంది. 2017–18 రబీ సీజన్‌ ఆగస్టు 15తోనే ముగుస్తుంది. అయితే కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన మిల్లర్లు ఇప్పటివరకు 68 శాతమే సీఎంఆర్‌గా అందించారు. ఇప్పటివరకు 58,920 టన్నుల బియ్యాన్ని అప్పగించకుండా తమ వద్దే పెట్టుకున్నారు. అందుకు గోదాముల్లో నిల్వ సామర్థ్యం లేదనే కారణం చెబుతున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ మిల్లుల్లోనే నిల్వ ఉందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముంది. మిల్లర్లపై ఒత్తిడి పెంచినా గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం తరలించడానికి చర్యలు లేకపోవడమే ఇందుకు కారణంగా స్పష్టమవుతోంది.
 
సీఎంఆర్‌ ఇంకెప్పుడు..?
ధాన్యం ఉత్పత్తిలో జిల్లా కొన్నేళ్లుగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటోంది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 2018 రబీలో 2,60,844 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. ఈ ధాన్యాన్ని  జిల్లాలోని 121 మిల్లర్లకు ఇచ్చింది. వీరిలో 84 మంది  బాయిల్డ్‌ మిల్లర్లు, 37 మంది రారైస్‌ మిల్లర్లు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులోగా ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలనేది నిబంధన. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై తెల్లకార్డుదారులకు పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చితే 1,77,314 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వ ధాన్యాన్ని తమ మిల్లులకు కేటాయించుకున్న మిల్లర్లు బియ్యం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.

గడువు ముగిసినా ఇప్పటికీ బియ్యం పూర్తిగా ఇవ్వలేదు. జిల్లావ్యాప్తంగా ఇంకా 58,920 టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇప్పటికీ 1,18,393 టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. మిగిలిన బియ్యాన్ని వెంటనే రాబట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన పౌర సరఫరాల శాఖ.. మిల్లర్లకు గడువు పొడిగిస్తూ కాలం వెల్లదీస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యంలో తక్కువగా వచ్చినవి మిల్లర్లు వద్ద కూడా లేవని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉండడంతో కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకున్నట్లు తెలిసింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే మిల్లర్ల సంఘం ప్రోద్బలంతో రాజకీయంగా ఒత్తిడులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ధాన్యం అక్రమార్కుల పాలవుతోందని తెలుస్తోంది.


తమిళనాడుకు అనుమతి కరువు
రబీలో ప్రభుత్వ ధాన్యంతోపాటు రైతుల నుంచి మద్దతు ధరకు మించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చిన రైస్‌మిల్లర్లకు వాటిని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కలుసుకుని ఒప్పందం ప్రకారం తమిళనాడుకు బియ్యం అమ్ముకునేందుకు అనుమతి నివ్వాలని విన్నవించారు. తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల టన్నుల బియ్యాన్ని తమిళనాడుకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో 60 వేల టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 80 వేల టన్నుల బియ్యాన్ని విక్రయించేందుకు అగ్రిమెంట్‌ చే యించుకున్నారు. అవి రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.1590తో పా టు అదనంగా రూ.30 చొప్పున క్విం టాలుకు కొనుగోలు చేయాలని నిబం ధన విధించారు. ఈ క్రమంలో రైతుల నుంచి సీఎంఆర్‌కు అదనంగా ధా న్యం కొనుగోలు చేశారు.

1620 క్విం టాలు చొప్పున కొనుగోలు చేసి వాటిని బియ్యం గా తమిళనాడుకు క్వింటాల్‌కు రూ.2450 చొప్పు న విక్రయించేందుకు అగ్రిమెంట్‌ పొందారు. తీరా సీజన్‌ ముగుస్తున్నా అనుమతిపై స్పందించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు చెల్లించి వారి వివరాలతోపాటు అకౌంట్‌ పే చెక్, బ్యాంకు స్టేట్‌మెంట్‌తో సమర్పించడానికి సిద్ధం గా ఉన్నా ప్రస్తుతం ప్రభుత్వం విక్రయానికి అనుమతించడం లేదు. రబీ ధాన్యం పూర్తిగా అటు సీఎంఆర్‌గా.. ఇటు కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోతే వచ్చే ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఫలితంగా రైతులు ఇబ్బందుల పాలయ్యే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు.

 
గోదాములన్నీ ఫుల్‌
జిల్లాలో ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములకు సంబంధించి 94 మిల్లుల పరిధిలో 1,15,700 టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తు తం ఆయా గోదాములన్నీ నిల్వలతో నిండిపోయి ఉన్నాయి. అవి ఖాళీ చేసే పరిస్థితి లేకపోవడంతో కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యానికి జాగలేకుండా పోయిం ది. జిల్లావ్యాప్తంగా 121 మంది రైస్‌మిల్లర్లకు కేటా యించిన 2,60,844 మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో బియ్యంగా మరాడించి 1,77,314 మెట్రిక్‌ టన్నులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. బాయిల్డ్‌ రైస్‌ క్వింటాలుకు 68 శాతం, రారైస్‌ క్వింటాలుకు 67 శాతం బియ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 శాతంపైగా రావాల్సిన సీఎంఆర్‌ 66 శాతమే ప్రభుత్వానికి వచ్చింది. గడువులోగా పూరిస్థాయి సీఎంఆర్‌ అందించడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం గోదాముల్లో  కేవలం 25 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల స్ధలం మాత్రమే ఖాళీగా ఉంది. జిల్లాలో పీడీఎఫ్‌ బియ్యం, గోధుమలు, రబీ బియ్యం తదితర  నిల్వలతో గోదాములు 90 శాతం వరకు నిండుకున్నాయి.
 
పత్తాలేని ర్యాకులు
జిల్లాకు రైల్వే ర్యాకుల కొరత వెంటాడుతోంది. అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి రైల్వే శాఖ నిర్లక్ష్యం ఫలితంగా సరైన ర్యాకుల కేటాయింపులు లేక ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీ కావడం లేదు. ఒక్కోర్యాకు సామర్థ్యం 2500 మెట్రిక్‌ టన్నులు ఉంటుంది. నెలకు 35 వ్యాగన్లు రావాల్సి ఉన్నా ఆ దిశగా ఒక్కటీ కానరావడం లేదు. తమిళనాడు, కేరళలో వర్షాలు, వరదల కారణంగా ర్యాకులు ని లిచిపోయినట్లు తెలుస్తోంది. వ్యాగన్ల కోసం అధి కార యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతున్నా స్పందన లేదు. సకాలంలో ర్యాకులు వస్తే తప్ప గోదాములు ఖాళీ అయ్యే పరిస్థితి కానరావడం లేదు. ఎఫ్‌సీఐ అధికారులు పట్టించుకోని కారణంగానే గోదాముల సమస్య జఠిలమవుతోంది. రైల్వేశాఖ ర్యాకులు కేటాయిస్తున్నా వాటిని తెప్పించే ప్రయత్నాలు చేయడంలో ఎఫ్‌సీఐ అధికారులు విఫలమవుతున్నారు. అధికారయంత్రాంగం సై తం అటు రైల్వేశాఖపైగానీ.. ఇటు ఎఫ్‌సీఐ శాఖపైగానీ ఒత్తిడి తీసుకొస్తే తప్ప పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కానరావడం లేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు