‘ఖరీఫ్‌’పై వ్యవసాయ శాఖ శీతకన్ను

11 Jun, 2018 01:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అనేకచోట్ల వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌ సీజన్‌ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు దుక్కు లు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే ఖరీఫ్‌ సాగుౖ పె రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ వెనుకబడింది.

పది రోజులుగా వ్యవసాయాధికారులు, ఉద్యోగులంతా బదిలీలపైనే దృష్టి సారించారు. మరోవైపు రైతుబంధు చెక్కుల పంపిణీ, రైతు బీమా పథకాల అమలుపై దృష్టి సారించారు. ఇప్పటివరకు ఖరీఫ్‌లో ఏంచేయాలన్న దానిపై ఒక్క సమావేశాన్ని కూడా వ్యవసాయశాఖ నిర్వహించలేదన్న ఆరోపణలున్నాయి.

రైతు చైతన్య యాత్రల రద్దు..
వ్యవసాయశాఖ ఏటా మే నెలలో నిర్వహించే రైతు చైతన్య యాత్రలు ఈసారి రద్దయ్యాయి. వారంపాటు నిర్వహించే రైతు చైతన్య యాత్రల్లో  ఖరీఫ్‌లో రైతులు చేపట్టాల్సిన సాగు పద్ధతులు, వేయాల్సిన పంటలు, విత్తనాలు, ఎరువులు, వాటి లభ్యత, ఇస్తున్న సబ్సిడీ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.

అన్నదాతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తారు. వాతావరణశాఖ అందించే వర్షపాతం వివరాల ఆధారంగా ఏ సమయంలో ఏ పంటలు వేయాలో కూడా చెబుతారు. ఇలాంటి కీలక కార్యక్రమాన్ని ఈసారి వ్యవసాయశాఖ వదిలేసింది. మరోవైపు వార్షిక ప్రణాళికను కూడా తయారు చేయనేలేదు.

మరిన్ని వార్తలు