చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి

13 May, 2019 02:04 IST|Sakshi
ప్రణతి (ఫైల్‌) , ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తండ్రి మల్లేశ్, బంధువులు

ఈ నెల 8న పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలు

కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి

డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం

కుటుంబసభ్యులను పరామర్శించిన రాచకొండ సీపీ 

హైదరాబాద్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వద్ద ఈ నెల 8న పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. వివరాలు.. ఎల్బీనగర్‌ చైతన్యపురి డివిజన్‌ మున్సిపల్‌ కాలనీకి చెందిన పి.మల్లేష్‌ జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి. 7 నెలల క్రితం మల్లేశ్‌ భార్య సంధ్య డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. మల్లేశ్‌కు ఇద్దరు కుమార్తెలు ప్రీతి (5), ప్రణతి (మూడున్నరేళ్లు) ఉన్నారు.

అక్క కుమార్తె నవీనకు బియ్యం పోస్తుండటంతో ఈ 8వ తేదీ సాయంత్రం తన తల్లి, పిల్లలతో కలసి మల్లేశ్‌ యాదగిరిగుట్టకు వెళ్లాడు. అనంతరం 9వ తేదీ ఉదయం పాత లక్ష్మీనర్సింహస్వామి గుడిలో సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకునేందుకు బంధువులతో కలసి పాత గుట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో మల్లేశ్‌ తన తల్లి బుచ్చ మ్మ, చిన్న కుమార్తె ప్రణతితో కలసి దేవాలయానికి ఎదురుగా ఉన్న పార్కింగ్‌లోని చెట్టు నీడలో సేద తీరుతున్నారు.

ఈ సమయంలో అటుగా వచ్చిన యాదాద్రి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు వాహనం (టీఎస్‌09 పీఏ 5508) నీడలో సేద తీరుతున్న మల్లేశ్, ప్రణతిలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రణతిని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మృతి చెందింది. దీంతో చిన్నారి తండ్రి మల్లేశ్, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదానికి వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం భార్య, ఇప్పుడు కుమార్తె మృతి చెంద డంతో మల్లేశ్‌ బోరున విలపించాడు. ప్రణతి అంత్యక్రియలను సైదాబాద్‌ దోభిఘాట్‌ శ్మశానవాటికలో నిర్వహించారు.

ప్రణతి మృతి చెందిన సమాచారం అందుకున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు. ప్రణతి అక్క ప్రీతి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని ఎల్బీనగర్‌ ఏసీపీ పృద్వేందర్‌రావు తెలిపారు. చిన్నారి అంత్యక్రియలకు పోలీసులు రూ.50 వేలు ప్రణతి కుటుంబసభ్యులకు అందజేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు