వీడిన ఉత్కంఠ.. క్షేమంగా దొరికిన చిన్నారి

20 May, 2015 05:11 IST|Sakshi
వీడిన ఉత్కంఠ.. క్షేమంగా దొరికిన చిన్నారి

కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు
 
నిర్మల్ అర్బన్ : నిర్మల్ మండలంలో చిన్నారి కిడ్నాప్ ఉదాంతానికి తెర వీడింది. కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి మంగళవారం ఉదయం క్షేమంగా లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం చిన్నారి జాడ కోసం గాలించిన పోలీసు లు, గ్రామస్తులకు మాదాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పాప దొరికిందని రూరల్ సీఐ పురుషోత్తం తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు పాపను అప్పగించారు. అనంతరం వివరాలు వెల్లడించారు. జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన బీటు ముత్యం, లక్ష్మీ దంపతుల నాలుగేళ్ల కూతురు ప్రశాంతి సోమవారం రాత్రి ఇంటివద్ద ఆడుకుంటుంది. సారంగాపూర్ మండలానికి చెందిన నారాయణ అనే భవన నిర్మాణ కూలీ కొద్ది రోజుల క్రితం జాఫ్రాపూర్‌లో ఓ ఇంటి నిర్మాణపు పనులు చేశారు. దీంతో ప్రశాంతి కుటుంబసభ్యులతో కాస్తా పరిచయం ఉండటంతో సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన నారాయణ, చాక్లెట్స్ కొనిస్తానని చెప్పి పాప ను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కు టుంబ సభ్యులు, గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు.
 
పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే అమావాస్య కావడంతో అందరిలో ఆందోళన పెరిగింది. పాప కోసం రాత్రంతా గాలించారు. అయితే మంగళవారం ఉదయం మాదాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు చిన్నారి ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా పాప కనిపించింది. దీంతో స్థానిక సర్పంచ్ సహాయంతో పాపను పోలీసులకు అప్పగించారు. పాపను ప్రశాంతిగా గుర్తించిన పోలీసులు, ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే నారాయణ ఆచూకీ లభించలేదు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలు ఎత్తుకెళ్లినట్లు సీఐ తెలిపారు. మద్యానికి బానిసైన నారాయణ, చిన్నారి పట్టగొలుసులు ఎత్తుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. నారాయణ కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు. కాగా చిట్యాల్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంగతి వట్టి వదంతులేనని చెప్పారు. అయితే దిలావార్‌పూర్ మండలంలోని మాయాపూర్ గ్రామంలో ఉన్న బావిలో నీరు ఎక్కువగా ఉందని, ఇందులో గుప్తనిధులున్నాయన్న పుకార్లు ఉండటంతో వదంతులు నెలకొన్నట్లు పేర్కొన్నారు.
 
తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి
జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి స్రవంతి క్షేమంగా మంగళవారం ఉదయం తల్లిదండ్రుల చెంతకు చేరింది. సోమవారం అమావాస్య కావడంతో అంతా ఆందోళన చెందారు. రాత్రి ఆచూ కీ దొరకకపోవడంతో కుటుంబీకులు, బంధువులు, గ్రామంలో ఉత్కంఠ నెల కొంది. అయితే ఉదయం చిన్నారి క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాప తిరిగి ఇంటికి చేరకోవడం తో బంధువుల్లో ఆనందం కనిపించింది.

మరిన్ని వార్తలు