ఆగుతూ.. సాగుతూ.. 

2 Jun, 2018 14:55 IST|Sakshi
డయాలసిస్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులు 

డయాలసిస్‌ బాధితులకు రక్తశుద్ధి ఆగుతూ.. సాగుతోంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే జిల్లాలోని రెండు డయాలసిస్‌ కేంద్రాలూ పనిచేయడం లేదు. జనరేటర్లు లేకపోవడంతో రక్తశుద్ధి గంటల తరబడి నిలిచిపోతోంది. దీంతో రోగులు అవస్థ పడుతున్నారు. దీనికితోడు నెఫ్రాలజిస్ట్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్లే డయాలసిస్‌ చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్లే పర్యవేక్షిస్తున్నారు.  

కొత్తగూడెంరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఒక్కోటి చొప్పున రెండు డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.2 కోట్లు వెచ్చించింది. ఇవి కిడ్నీలు పనిచేయని వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో హైదరాబాద్‌ వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి, వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకునేవారు. ఇక్కడ ఏర్పాటు చేశాక వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. కానీ వైద్యనిపుణులను నియమించకపోవడం, మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.  

కొత్తగూడెంలో..  
గత నెల 12న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభించారు. 4 నెగిటివ్‌ బెడ్స్, మరొకటి పాజిటివ్‌ బెడ్‌ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజు 20 మంది పేషెంట్‌ల వరకు డయాలసిస్‌ కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ నెఫ్రాలజిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లే రక్తశుద్ధి ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పేషెంట్‌కు ఏదైనా 

జరిగితే ఏంటి పరిస్థితని బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక పేషెంట్‌కు నాలుగు గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు. ఇలా 24 గంటల వరకు ఆరుగురికి, మొత్తం నాలుగు బెడ్స్‌లో రోజుకు 24 మందికి రక్తశుద్ధి చేస్తారు. కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు రోజుకు సుమారు 20 మంది చొప్పున 515 మంది డయాలసిస్‌ చేయించుకున్నారు.  

కరెంటు పోతే ఇబ్బందులే.. 
ఆస్పత్రికి జనరేటర్‌ ఉన్నా డయాలసిస్‌ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్‌ సౌకర్యం లేదు. ఎక్కువ సమయం కరెంటు పోతే డయాలసిస్‌ను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. మళ్లీ కరెంటు వచ్చినా తర్వాత రక్తశుద్ధిని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలో తరచూ కరెంటు పోతుండటం వల్ల రక్త శుద్ధి ఆగిపోతోంది. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

భద్రాచలంలో.. 
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 3న డయాలసిస్‌ కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు 171 మందికి రక్తశుద్ధి చేశారు. కేంద్రంలో ఆయాల పోస్టు ఖాళీగా ఉన్నాయి. జనరేటర్‌ సౌకర్యం లేదు. కరెంటు పోతే రోగులు ఇబ్బందులు పడక తప్పదు. నెఫ్రాలజిస్టు కూడా లేరు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఒక్కో షిఫ్టునకు ఒక టెక్నీషియన్, ఒక స్టాఫ్‌ నర్స్‌.. మొత్తం ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాలసిస్‌ కేంద్రాలకు ప్రత్యేకంగా జనరేటర్‌తోపాటు, నెఫ్రాలజిస్ట్‌ పోస్టులను నియమించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు