మరో ప్రాణం పోయింది!

30 Aug, 2017 01:18 IST|Sakshi
ఆగస్టు 16న సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం.. (మేరావత్‌ లక్ష్మణ్‌ (ఫైల్‌) )

ఈ గ్రామ దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
కిడ్నీ వ్యాధులతో సంభవిస్తున్న మరణాలపై కథనాలు
అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం
ఇప్పుడు బాలుడి మృతితో కదలిక
బుధవారం గువ్వలగుట్టను సందర్శించనున్న అధికారులు
కిడ్నీ బాధితులపై ఆరా.. నీటి శాంపిళ్లను పరీక్షించాలని నిర్ణయం  


చందంపేట (దేవరకొండ): కన్న తల్లి దండ్రుల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.. వారి కళ్ల ముందే కొడుకు ప్రాణం గాలిలో కలసిపోయింది.. ఎంత మొరపెట్టుకున్నా.. పత్రికల్లో కథనాలు వచ్చినా.. స్పందించని ప్రభుత్వ యంత్రాంగానికి ఆ చిన్నారి ప్రాణం బలైపోయింది.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన మేరావత్‌ లక్ష్మణ్‌ (12) మంగళవారం కన్నుమూశాడు. గువ్వలగుట్టలో జనం కిడ్నీ వ్యాధుల కారణంగా వరుసగా మృతి చెందుతున్న వైనంపై, చావు బతుకుల్లో ఉన్న లక్ష్మణ్‌ పరిస్థితిపై ‘జనం పరిస్థితి అధ్వానం.. ఇది మన ఉద్ధానం’పేరిట పక్షం రోజుల కింద ‘సాక్షి’మాన వీయ కథనాన్ని ప్రచురించింది. అక్కడి జనం పడుతున్న బాధలను వివ రించింది. కానీ అధికార యంత్రాంగంలో స్పందన కనిపించలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మణ్‌ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టను సందర్శించాలని నిర్ణయించింది.

ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా..గువ్వలగుట్ట రోగాల పుట్టగా మారి పోతోంది. కిడ్నీ వ్యాధులు మెల్లమెల్లగా ఆ గ్రామాన్నే కబళించేస్తున్నాయి. ఇక్కడి నీటిలోని రసాయనాల కారణంగా ఈ దుస్థితి తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈ గ్రామం దుస్థితిపై ‘సాక్షి’ఎన్నో కథనాలను ప్రచు రించింది. ఆరు నెలల క్రితం ‘గువ్వలగుట్ట.. రోగాల పుట్ట’అన్న శీర్షికన గువ్వలగుట్టలో కిడ్నీ వ్యాధి మరణాలు, బాధితుల దీన స్థితిపై కథనాన్ని ప్రచురించింది. కిడ్నీ వ్యాధుల బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని వివరించింది. వ్యాధులతో బాధపడుతూ, లక్షలకు లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నా ఫలితం లేనివారి ఆందోళనను తెలిపింది. వారితోపాటు లక్ష్మణ్‌ పరిస్థితిని, తల్లి దండ్రుల ఆవేదనను కూడా వివరించింది. అయినా అధికార యంత్రాంగంలో స్పందన కానరాలేదు.

సురక్షిత నీరు అందేదెన్నడు?
గువ్వలగుట్టకు అతి సమీపంలోనే ఉన్న కృష్ణా బ్యాక్‌వాటర్‌ నుంచి మంచినీటిని ఈ గ్రామానికి అందించేందుకు చేపట్టిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ట్యాంకులు నిర్మించి, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే పను లను మొదలుపెట్టి.. అర్ధంతరంగా వదిలే శారు. దాదాపు ఏడాదిగా కదలిక లేదు.

నేడు గువ్వలగుట్టకు వైద్యారోగ్య శాఖ బృందం
నల్లగొండ టౌన్‌: నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్టను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి బృందం సందర్శించనుంది. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి జనం అవస్థలపై కథనాలు, మంగళవారం లక్ష్మణ్‌ అనే బాలుడి మృతి నేపథ్యంలో.. అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టకు చేరుకుని కిడ్నీ వ్యాధుల బాధితులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుని.. ఇక్కడి బోరుబావులు, నీటి పంపులను పరిశీలిస్తారు. నీటి శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపుతారు. చీఫ్‌ వాటర్‌ అనలిస్ట్‌ డాక్టర్‌ ఆంజనేయులు, సీనియర్‌ అనాలసిస్ట్‌ డాక్టర్‌ కిరణ్మయి ఈ బృందంలో ఉంటారు.

మరిన్ని వార్తలు