ఎన్‌కౌంటర్ల పేరిట చంపుతున్నారు

28 Dec, 2017 01:03 IST|Sakshi

‘రాజ్యహింస – ప్రతిఘటన’ సదస్సులో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీలను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. 37, 38, 39 అధికరణల ప్రకారం సంక్రమించిన సమానహక్కులను కూడా హరిస్తున్నారని విమర్శించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే)లో ‘రాజ్యహింస – ప్రతిఘటన’ అనే అంశంపై సదస్సు జరిగింది. వివిధ ఎన్‌కౌంటర్లలో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులు సదస్సులో విలపించారు.

టీఆర్‌ఎస్‌ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, మేకతోలు కప్పుకున్నవారిలాగా పాలకులున్నారని, వారిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దానిపై న్యాయవిచారణ జరిపించాలని పేర్కొన్నారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ ప్రభుత్వ హత్యేనని, దళసభ్యుల్ని ముందే పట్టుకుని, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురున్నారని, వారికి ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టులో హాజరుపర్చాలని అన్నారు.

పాలకులుగా ఎవరున్నా హింస ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తే మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ తెలంగాణలో రక్తపుటేరులు పారిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోయినవారిలో 95 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు.

టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. సభలు, సమావేశాలకు అనుమతివ్వకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, విమలక్క, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, జి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

సభలో గందరగోళం...
సభాప్రాంగణంలో సీపీబాట పేరుతో కరపత్రాలను పంచిపెట్టడం వివాదాస్పదమైంది. వాటిలో న్యూడెమోక్రసీపై విమర్శలుండటంతో ఆ పార్టీ రాష్ట్ర నేత పోటు రంగారావు అభ్యంతరం తెలిపారు. సభకు మద్దతు తెలపడానికి వచ్చిన తమ పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం ఏంటని ప్రశ్నించడంతో కాసేపు గందరగోళం నెలకొంది.

మరిన్ని వార్తలు