కోడికూర కొక్కొరోకో..

29 May, 2017 00:46 IST|Sakshi
కోడికూర కొక్కొరోకో..

► కిలో చికెన్‌ రూ. 250
► రికార్డు స్థాయికి చేరిన ధర
► గతేడాది రూ.200లోపే..
► ఎండ దెబ్బకు నెల రోజుల్లోనే 25 లక్షల కోళ్లు మృతి
► ఫారాల యజమానులకు రూ.50 కోట్ల నష్టం
► మరో పది రోజులు ఇవే ధరలు


సాక్షి, హైదరాబాద్‌: కోడి ధర కొండెక్కింది.. ఎండ దెబ్బకు చికెన్‌ రేటు మండిపోతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్‌ ధర రూ.250కి ఎగబాకింది! దీంతో సామాన్యులు చికెన్‌ కొనాలంటే వెనకాముందు ఆలోచిస్తున్నారు. కోడిని వదిలేసి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. హోటళ్లలోనూ వినియోగదారులకు చికెన్‌ పరిమాణాన్ని తగ్గించి పెడుతున్నారు. కొన్నిచోట్ల ధరలు కూడా పెంచేశారు. కోళ్ల ధరలు పెరగడంతో చికెన్‌ వ్యాపారం తగ్గిపోయిందని దుకాణదారులు చెబుతున్నారు. మరో 10 రోజులు ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని పౌల్ట్రీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఆదివారం 70 లక్షల కిలోలు
తెలంగాణలో నెలకు 4 కోట్ల కిలోల చికెన్‌ విక్రయాలు జరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో రోజూ 4 లక్షల కిలోల విక్రయాలు జరుగుతుంటే.. ఆదివారాల్లో మాత్రం 70 లక్షల కిలోల దాకా చికెన్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. బ్రాయిలర్‌ ఫారాల నుంచి వ్యాపారులకు కోళ్లను కిలోకు రూ.100 వరకు విక్రయిస్తుంటారు. డిమాండ్‌ తక్కువైతే ఒక్కోసారి రూ.75కు కూడా విక్రయిస్తుంటారు. గతేడాది ఇదే సీజన్‌లో రూ.100కు మించి ధర పలకలేదు. అలాంటిది ప్రస్తుతం కోళ్ల ఫారాల యజమానులు కిలో రూ.125కు విక్రయిస్తున్నారు. దీంతో చికెన్‌ దుకాణాల్లో ధరలు పెరిగిపోయాయి. లైవ్‌ చికెన్‌ కిలో రూ.145, స్కిన్‌తో రూ.210, స్కిన్‌లెస్‌ రూ.250 పెరిగిపోయింది. ఇంత భారీగా చికెన్‌ ధర ఎన్నడూ లేదని దుకాణదారులు అంటున్నారు. గతేడాది స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ.200 మించి పలకలేదు.

కోడికి ఎండదెబ్బ..
తెలంగాణలో 20 వేల కోళ్లఫారాలున్నాయి. వాటిల్లో 5.50 కోట్ల కోళ్లున్నాయి. అందులో 3.50 కోట్ల లేయర్‌ కోళ్లు, 2 కోట్ల బాయిలర్‌ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. ఈసారి రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు భారీగా మృతి చెందాయి. సాధారణంగా 37–38 డిగ్రీల వరకు మాత్రమే కోళ్లు ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. అంతకుమించి నమోదైతే చనిపోతాయి. 35–38 డిగ్రీలకు మించి ఉంటే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పైగా బయట ఉష్ణోగ్రతల కన్నా కోళ్ల ఫారాల్లో రేకుల షెడ్డుల కారణంగా మరో రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలుంటాయి. ఇంత వేడి కారణంగా నెల రోజుల్లో 25 లక్షల కోళ్లు మృతి చెందాయి. తీవ్రమైన ఎండకు తోడు భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లల్లో నీటి సమస్య తలెత్తింది. అనేకచోట్ల కోళ్ల ఫారాల కర్టెన్లను తడపడానికి కూడా నీళ్లు చల్లే అవకాశం లేకుండా పోయింది. సాధారణంగా కోడి పిల్ల ధర రూ.30 లోపే ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.43 దాకా పెరిగింది. ఏకంగా 25 లక్షల కోళ్లు మృతి చెందడం కూడా చికెన్‌ రేటు పెరగడానికి కారణమైంది. కోళ్ల మరణాలతో హైదరాబాద్‌లో చికెన్‌ ఉత్పత్తి 25 శాతం తగ్గిపోయింది.

రూ.50 కోట్ల నష్టం..
ఎండతో కోళ్లు భారీగా చనిపోవడంతో ఫారాల వ్యాపారులకు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.రంజిత్‌రెడ్డి చెప్పారు. బీమా సౌకర్యం లేకపోవడంతో ఆ నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి వస్తుందన్నారు. ‘‘ఎండలు తీవ్రంగా ఉండటంతో కోళ్లు లక్షల్లో చనిపోయాయి. భూగర్భ జలాలు పడిపోవడం, నీటి వసతి లేకపోవడంతో కోళ్లను కాపాడుకోలేకపోయాం. దీంతో మార్కెట్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగిపోయాయి. వర్షాలు కురిశాక తిరిగి సాధారణ స్థితికి ధరలు చేరుకుంటాయి’’అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఏటా సగటున ఒక్కో వ్యక్తి 3.8 కిలోల మేర చికెన్‌ వినియోగిస్తుండగా.. తెలంగాణలో 7 కిలోల మేర వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

కిలో రూ.250కు కొన్నా: ఫృథ్వి, వినియోగదారుడు, హైదరాబాద్‌
ఆదివారం స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.250 పెట్టి కొన్నా. ఎన్నడూ ఇంత ధర పెట్టి కొనలేదు. ఎందుకు ఇంత ధర పెరిగిందో అంతుబట్టడంలేదు. చికెన్‌ వ్యాపారులు ధరలు తగ్గించాలి.

ఇంత ధర ఎన్నడూ లేదు: సుధాకర్, చికెన్‌ దుకాణదారుడు, హైదరాబాద్‌
చికెన్‌ రూ.250 ఉండటం నేను ఎన్నడూ చూడలేదు. వారం రోజులుగా ఈ స్థాయిలో ధరలున్నాయి. గతేడాది ఎంత ఎండలు ఉన్నా ధర రూ.200 వరకే పెరిగింది. ఇప్పుడు రేటు ఎక్కువుండడంతో చాలామంది కోడి గుడ్లు తీసుకుపోతున్నారు.

మరిన్ని వార్తలు