ఓపెన్‌కాస్ట్‌ ప్రమాదం : వైఎస్‌ జగన్‌లా ఆదుకోవాలి

3 Jun, 2020 10:56 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఉపరితల గనిలో మంగళవారం జరిగిన ప్రమాదానికి కారణమైన వారిని సస్పెండ్‌ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్జి పాలిమర్స్‌ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చినట్లు సింగరేణి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

రామగుండం రీజియన్, ఆర్జీ–3 డివిజన్‌ పరిధిలోని ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టు–1 (ఓసీపీ–1) బొగ్గుగని ఫేజ్‌–2లో మట్టి తొలగిస్తుండగా జరిగిన ప్రమాదంలో కమాన్‌పూర్‌కు చెందిన బిల్ల రాజేశం (46), గోదావరిఖనికి చెందిన రాకేశ్‌ రాజన్న బెల్కివార్‌ (27), బండారి ప్రవీణ్‌ (37), కమాన్‌పూర్‌ (దాసరిపల్లి)కి చెందిన బండి అర్జయ్య (48)లు మృతిచెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. (‘సింగరేణి’లో భారీ పేలుడు)

కాగా, నష్ట పరిహారం విషయంలో సింగరేణి అధికారులతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు ఇంకా కొలిక్కిరాకపోవడంతో మృతుల కుటుంబసభ్యుల ఆందోళన కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించాడు. అయితే కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు