ఆన్‌లైన్‌లో కిరాణా ఈ స్టోర్‌

5 May, 2020 03:34 IST|Sakshi

కిరాణా దుకాణ వివరాలు సులభంగా నమోదుకు వీలు

ఇంటి ముంగిటకే నిత్యావసరాలు వచ్చే ఏర్పాటు

ట్రేడర్స్‌ కాన్ఫెడరేషన్‌తో పరిశ్రమల శాఖ భాగస్వామ్యం

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను అనుసంధానం చేస్తూ తెలంగాణ స్టేట్‌ గ్లోబల్‌ లింకర్‌ నెట్‌ వర్కింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘కిరాణా లింకర్‌’అనే పోర్టల్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. గతంలో ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలను డిజిటలైజేషన్‌ చేసిన తరహాలోనే ప్రస్తుతం కిరాణా దుకాణాలను కూడా ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ఒకే వేదిక మీదకు తేవాలని నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ స్టేట్‌ గ్లోబల్‌ లింకర్‌ నెట్‌వర్కింగ్‌ పోర్టల్‌తో పాటు, ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ కాన్ఫెడరేషన్‌ (సీఏఐటీ) సహకారం తీసుకోవాలని తెలంగాణ పరిశ్రమల శాఖ నిర్ణయించింది.

సమీకృత చెల్లింపుల విధానం, ఇతర పరిష్కారాలతో కూడిన ‘కిరాణా లింకర్‌’పోర్టల్‌లో స్థానికంగా కిరాణా, నిత్యావసరాలు అమ్మే వ్యాపారులు తమ వివరాలతో ‘ఈ స్టోర్‌’ను నిమిషాల వ్యవధిలో చాలా సులభంగా సృష్టించుకోవచ్చు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం, ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్థానిక నిత్యావసరాల దుకాణాల నుంచి అవసరమైన సరుకుల కొనుగోలు వంటివి ‘కిరాణా లింకర్‌’పోర్టల్‌ ద్వారా సాధ్యమవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ‘ఈ స్టోర్‌’లను కేవలం నిత్యావసరాలకే కాకుండా, ఇతర వ్యాపార సంస్థలకూ విస్తరించే అవకాశమున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో, వారణాసి, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌ వంటి పట్టణాల్లో ‘కిరాణా లింకర్‌’పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఆచరణలోకి తేవాలని సీఏఐటీ కోరుతోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో  అనుసంధానం..
తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు గతంలో ‘టీఎస్‌ గ్లోబల్‌ లింకర్‌’ను ప్రారంభించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. కిరాణా లింకర్‌ను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా గ్లోబల్‌ లింకర్, సీఏఐటీ ప్రతినిధులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో నిత్యావసరాలు గుమ్మం ముందుకు రావాలని వినియోగదారులు కోరుకుంటున్న నేపథ్యంలో కిరాణా, నిత్యావసరాల దుకాణాల యజమానులు కిరాణా లింకర్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కిరాణా లింకర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన చోట వినియోగదారులు, వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తోందని జయేశ్‌ వ్యాఖ్యానించారు. త్వరలో ‘భారత్‌ ఈ మార్కెట్‌’తో టీఎస్‌ గ్లోబల్‌ లింకర్‌ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలసి పనిచేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు