‘సాయానికి’ సమాయత్తం 

14 Feb, 2019 07:21 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘కిసాన్‌ సమ్మాన్‌’ యోజన పథకం అమలు ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సాగులో రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని 2018 ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్‌లో పంట పెట్టుబడిగా రెండు విడతలు రూ.4వేల చొప్పున రైతులకు ఇప్పటికే చెల్లించారు. 2019–20లో రూ.5వేల చొప్పున.. రూ.10వేలను అందిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకాన్ని ప్రకటించింది.

దీనిని సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల భూమి ఉన్న రైతులకు ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6వేలు అందించనున్నారు. దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు 12వేల కోట్ల మంది ఉండగా.. ఏడాదికి రూ.75వేల కోట్లను కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద రైతులకు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసి.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పథకం అమలులో వ్యవసాయ శాఖ కీలక భూమిక పోషించనుంది. దీనిపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.. కలెక్టర్‌తో సమావేశమై పథకం అమలుపై చర్చించే పనిలో నిమగ్నమయ్యారు.

ఐదెకరాల్లోపు రైతులు అర్హులు 
కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకానికి ఐదెకరాల(2 హెక్టార్లు)లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు(మైనర్లు) కలిగి ఉన్న కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఐదెకరాల్లోపు ఎంత భూమి కలిగి ఉన్నా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చుతారు.

ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అనర్హులు 
గ్రూప్‌–4, గ్రూప్‌–డీ మినహా ఇతర ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ పన్ను కలిగి ఉన్న వారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనర్హులు. ఇక ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిల్లో ఉన్న వారు కూడా అనర్హులే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు కూడా అనర్హులే. ఇంజనీర్లు, డాక్టర్లకు కూడా ఈ పథకం వర్తించదు. రిటైర్డ్‌ ఉద్యోగుల్లో కూడా రూ.10వేలకు మించి పెన్షన్‌ పొందే వారికి ఈ పథకం వర్తించదు.
 
మూడు విడతలుగా సాయం 
కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకంలో అర్హులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6వేల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 4 నెలలను ఓ విడతగా రూపొందించి.. ఒక్కో విడతలో రూ.2వేలను కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు విడుదల చేస్తుంది.

25 నాటికి వివరాలు అందించాలి.. 
కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో అర్హులైన రైతుల జాబితాను ఈనెల 25వ తేదీ నాటికి అందించాలని(ఆన్‌లైన్‌) ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల మేరకు అర్హులైన రైతుల వివరాలను సేకరించి పంపించాలని ఆదేశాల్లో పేర్కొంది. రైతు పేరు, వయసు, స్త్రీ, పురుషుల వివరాలు, ఆధార్‌ నంబర్‌ లేదా ఏదైనా అర్హత కలిగిన గుర్తింపు కార్డు వివరాలతోపాటు రైతు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్, ఐఎఫ్‌ఎస్సీ కోడ్, మొబైల్‌ నంబర్‌ వివరాలను అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ వ్యవహారాలన్నీ వ్యవసాయ విస్తర్ణాధికారులకు అప్పగించే పనిలో వ్యవసాయ శాఖ ఉంది.

మార్చి 31 నాటికి తొలివిడత రూ.2వేలు ఖాతాల్లో జమ 
కిసాన్‌ పథకం కింద తొలి విడత నగదును మార్చి 31వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందని కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. పోస్టల్, కో–ఆపరేటివ్‌ బ్యాంకులతోపాటు అన్ని బ్యాంకులకు ఈ పథకం నగదును రైతులకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.  

జిల్లాలో రూ.2.50లక్షల మంది అర్హులు 
కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకానికి జిల్లాలో సుమారు 2.50లక్షల మంది అర్హులుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం రైతుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే ఏఈఓలు రంగంలోకి దిగనున్నారు. గ్రామాలవారీగా అర్హులైన రైతులను గుర్తించి.. జాబితాలను రూపొందించి గ్రామంలో ప్రదర్శించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు