పేద రైతుకే ‘పెట్టుబడి’

3 Mar, 2019 12:47 IST|Sakshi
కిసాన్‌ సమ్మాన్‌ నిధికి సంబంధించిన అర్హత పత్రాన్ని రైతుకు అందిస్తున్న  జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

రైతుబంధు పథకాన్ని వదిలేసిన 5 వేల మంది

గుంట భూమి ఉన్నా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా  రూ. 6 వేల సాయం

జిల్లావ్యాప్తంగా  1.07 లక్షల మంది  రైతులకు లబ్ధి

సాక్షి, మెదక్‌: చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం పేద కర్షకులకు వరంలా మారింది. నిరుపేద రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ పథకంతో గుంటభూమి ఉన్నా రైతుకు రూ. 6 వేలు వస్తుండటంతో వారు సంతోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో గుంట, రెండు గుంటల భూమి ఉన్న వేలాదిమంది పేద రైతులు ఆ పథకాన్ని వదిలేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 2.20 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో గత సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో 1.95 వేల మంది రైతులకు రూ.148 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించింది. ఇందులో 25 వేల మంది రైతులకు సంబంధించిన భూములు వివిధ సమస్యలు ఉండటంతో పార్ట్‌(బీ)లో పెట్టినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ రబీ సీజన్‌లో 1.73 వేల మంది మాత్రమే రైతుబంధును తీసుకోగా ఇందుకోసం రూ. 136 కోట్లను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

ఖరీఫ్‌ సీజన్‌ నుండి రబీ సీజన్‌తో పోల్చుకుంటే జిల్లావ్యాప్తంగా 5 వేల మంది రైతులు రైతుబంధు పథకాన్ని తీసుకోకుండా తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం  ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడమే ఈ లెక్కన గుంటభూమి ఉన్న రైతుకు కేవలం రూ. 100 మాత్రమే వచ్చింది. ఇలా ఐదారు గుంటల భూములున్న  రైతులు దాదాపు 5వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను తిరస్కరించారు. జిల్లాలో తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. దీంతో నిరుపేద రైతులకు రైతుబంధు పథకం ఉపయోగ పడడం లేదు. «ఎకరం నుంచి ఆపైన ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగ పడుతోంది.  ఈ లెక్కన వంద ఎకరాలు గల భూస్వామికి రూ. 4 లక్షలు రాగా ఎకరం భూమి ఉన్న రైతుకు కేవలం రూ. 4 వేలు మాత్రమే వచ్చింది. అదే గుంట భూమి ఉన్న రైతుకు రూ. 100 మాత్రమే చెక్కు రూపంలో వచ్చింది. దీంతో  ఐదారు గుంటల భూములున్న రైతులకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది

 జిల్లాలో లక్షా 7 వేల మందికి లబ్ధి..

జిల్లాలో 1.07 లక్షల మంది రైతులు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి అర్హులుగా తేల్చారు. జిల్లాలో 3.20 లక్షల ఎకరాల భూములు ఉండగా అందులో 1.7లక్షల మంది రైతులు మాత్రమే ఐదెకరాలలోపు భూములు కలిగి ఉన్నారు. ఒక్కో రైతుకు రూ. 6 వేలను మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేల చొప్పున అందిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విడతకు  జిల్లావ్యాప్తంగా రూ. 21.40 కోట్ల చొప్పున మూడు విడతల్లో రూ. 64.20 కోట్లను ఇవ్వనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతుల అకౌంట్లలో రూ. 2 వేల చొప్పున వేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

గుంట భూమి ఉన్నా కేంద్ర సాయం

గుంట భూమి ఉన్న రైతులు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి అర్హులే. జిల్లాలోని 5 వేల మంది రైతులకు ఎకరం కన్నా తక్కువ భూమి ఉంది. దీంతో వారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు చెక్కులను తీసుకోలేదు. గుంట భూమి ఉన్న రైతుకు రైతుబంధు కింద రూ. 100 మాత్రమే వస్తుందనే ఉద్దేశంతో తీసుకోలేదు. ఇలాంటి రైతులందరూ వారి పట్టాపాస్‌పుస్తకాలు, బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌ కార్డులు తెచ్చి ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారందరికీ ఏడాదికి రూ. 6వేల చొప్పున మూడు విడతల్లో డబ్బులు వస్తాయి. చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలి.  వ్యవసాయ శాఖ అధికారులకు డాక్యుమెంట్ల జిరాక్స్‌ కాపీలు ఇస్తే ఐదు సంవత్సరాల పాటు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతు అకౌంట్లకే వస్తాయి.
– పరశురాం, 
జిల్లావ్యవసాయశాఖ అధికారి

మరిన్ని వార్తలు