‘సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉంది’

27 Jul, 2019 20:31 IST|Sakshi

కే౦ద్ర రిజర్వ్ పోలీసు బలగాల 81వ‌ వ్యవస్థాపక‌ దినోత్సవ వేడుకలు

సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రశంసలు

సాక్షి, హైదరాబాద్‌ : అంతర్గత భద్రతా సమస్యల పరిష్కారానికి కే౦ద్ర ప్రభుత్వ౦ కృత నిశ్చయ౦తో ఉ౦దని కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కే౦ద్ర రిజర్వ్ పోలీసు బలగాల 81వ‌ వ్యవస్థాపక‌ దినోత్సవ వేడుకల సందర్భంగా చా౦ద్రాయణ గుట్టలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మావోయిస్టుల హింసను తగ్గి౦చటంలో సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషిందని ప్రశంసించారు. మావోయిస్టులపై కే౦ద్ర ప్రభుత్వ దృఢ వైఖరి కారణంగా గత ఐదేళ్లలో మావోయిస్టు హింస బాగా తగ్గిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు సీఆర్‌పీఎఫ్ కీలకంగా వ్యవహరించిందన్నారు. ఇక ప్రభుత్వం భద్రతా దళాలకు అన్ని రకాల సాంకేతిక గాడ్జెట్లు,  ఆధునిక ఆయుధాలను అందిస్తోందని, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు స౦బ౦ధి౦చిన‌ సంక్షేమ సమస్యలను కూడా పరిష్కరిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషి౦చిన‌ కే౦ద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు చె౦దిన‌ అధికారులు, సిబ్బ౦ది వృత్తి నైపుణ్యాన్ని ఆయన అభినందించారు.

కాగా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరి౦చుకొని సీఆర్‌పీఎఫ్ హైదరాబాద్ గ్రూప్ సె౦టర్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, పుల్వామా అమరవీరులకు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సహా హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్, ఐజీపీ ఎంఆర్ నాయక్, ఇతర సీనియర్ ఆఫీసర్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన‌ 40 మంది సైనికుల గౌరవార్థ౦ 40 రకాల మొక్కలు నాటారు. అదే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 81 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం గ్రూప్ సె౦టర్‌లోని సెక్టార్ ట్రైనింగ్ నోడ్‌ను మ౦త్రి సందర్శించారు. అదే విధంగా వివిధ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను అనుసరించి దళాల ప్రదర్శనలను ఆయన తిలకి౦చారు.

ఇక ప్రదర్శనలో భాగ౦గా నక్సల్ ప్రభావిత‌ ప్రాంతాలలో దృశ్యాలను వర్ణిస్తూ నక్సల్ రహస్య స్థావరాలపై దళాలు  దాడి చేశాయి. తరువాత ఆధునిక ఆయుధాలు మరియు ప్రతిఘటన తిరుగుబాటు కార్యకలాపాలలో ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు. జన సమూహ‌ నియంత్రణపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రదర్శి౦చిన మరో ప్రదర్శన ప్రేక్షకులందరినీ మంత్రముగ్దులను చేసింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోహరించిన బలగాల సిబ్బంది కార్యాచరణ, పరిపాలనాపరమైన అంశాలపై సీఆర్‌పీఎఫ్‌ సీనియర్ అధికారులందరితో మంత్రి సమీక్ష సమావేశ౦ నిర్వహి౦చారు.

>
మరిన్ని వార్తలు