బ్రిటిష్‌కాలం నాటి చట్టాలను మారుస్తాం

1 Dec, 2019 05:31 IST|Sakshi
ప్రియాంక కుటుంబీకులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్య

శంషాబాద్‌ రూరల్‌: ప్రియాంకరెడ్డి హత్య కేసు దేశ ప్రజలను కలిచివేసిందని, ఇది మానవ సమాజం సిగ్గుపడే సంఘటనని ఇలాంటివి పునరావృతం కాకుండా బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దుండగులు మృగాలకంటే హీనంగా ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్‌లోని నక్షత్ర కాలనీలో శనివారం ప్రియాంకారెడ్డి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బ్రిటిష్‌ కాలంలో ప్రవేశపెట్టిన ఐపీసీ, సీఆర్పీ చట్టాలున్నాయని, వాటిని మారుస్తామని తెలిపారు.

ట్రయల్‌ కోర్టు తీర్పును నేరస్థులు మిగతా కోర్టుల్లో సవాలు చేస్తూ ఏళ్ల తరబడి శిక్ష పడకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాకాకుండా ట్రయల్‌ కోర్టు తీర్పు తర్వాత సుప్రీం కోర్టులోనే తుది కేసు వాదనలు ఉండేలా చట్టాల్లో పూర్తి మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. పోలీసులు కూడా ఠాణాల పరిధి పేరుతో కేసుల నమోదుకు జా ప్యం చేయకుండా చట్టాలను మారుస్తామన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో శంషాబాద్‌ ఘటనలో నేరస్తు లకు తప్పకుండా శిక్షపడేలా చేస్తామన్నారు.   మహిళలపై జరుగుతున్న దాడులపై సోమవారం లోక్‌సభలో ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్టు సిస్టమ్‌’అమలుకు ప్రవేశపెట్టిన 112 యాప్‌పై మాట్లాడతానని తెలిపారు. యాప్‌పై అందరికీ అవగాహన కల్పించడంతో పాటు యువకులు వలంటీర్లుగా ఇందులో పాల్గొనాలని కోరారు.  

మరిన్ని వార్తలు