గల్ఫ్‌ పొమ్మంది.. ఊరు రమ్మంది

9 Dec, 2017 11:52 IST|Sakshi
కౌలుకు తీసుకున్న పొలంలో గల్ఫ్‌ బాధితుడు కిషన్‌,తన కుటుంబసభ్యులతో కిషన్‌

మస్కట్, సౌదీకి వెళ్లొచ్చిన గంభీరావుపేట వాసి

ఖాళీ చేతులతోనే ఇంటి ముఖం

గ్రామంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం

‘గల్ఫ్‌లో పడ్డ కష్టాలు గుర్తుకొస్తే.. ఇప్పటికీ కన్నీళ్లొస్తాయి.. దేశం పోతే నాలుగు పైసలు సంపాదించుకోవచ్చనుకుంటే.. కష్టాలే మూటగట్టుకొని వచ్చిన. కుటుంబ సభ్యుల ఆత్మీయతకు దూరమయ్యా.. ప్రస్తుతం ఇక్కడే తెలిసినోళ్ల పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాను.’ ఇవీ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఈరవేని కిషన్‌ మాటలు.
కిషన్‌ ఉపాధి కోసం ఒమాన్, సౌదీ దేశాలు వెళ్లి తిరి గొచ్చాడు. ఒక్కసారి మస్కట్‌లో ఆరు నెలలు ఉండి కూలీ పనులు చేశాడు. అక్కడి కష్టాలు తట్టుకోలేక తిరిగొచ్చా డు. ఇక్కడ ఉపాధి అవకాశాలు కనిపించకపోవడంతో కొన్నాళ్లకు మళ్లీ మస్కట్‌కు వెళ్లాడు. నాలుగు నెలల పాటు వంట మనిషికి సహాయకుడిగా పనిచేసి తిరిగొచ్చాడు.

మస్కట్‌ వెళ్లడానికి చేసిన అప్పులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారడంతో ఈసారి సౌదీ వెళ్లాడు. అక్కడ అనేక కష్టాలకోర్చి బల్దియాలో పనిచేశాడు. ఇరుకుగదుల్లో కాలం వెళ్లదీశాడు. ఆరోగ్యం సహకరించలేదు. ఏడాదిన్నర ఉండి ఇంటికొచ్చేశాడు. ఇలా గల్ఫ్‌ బాటలో సుమారు రూ.3లక్షల వరకు అప్పులపాలయ్యాడు. దూరదేశాల పయనంతో తాను తీవ్రంగా నష్టపోయానని, ఇప్ప టికీ ఉండటానికి సరైన ఇల్లు లేదని కిషన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య లావణ్య బీడీలు చుడుతోంది. పిల్లలు సాయిచరణ్, వైష్ణవి ఉన్నారు. కిషన్‌ తెలిసిన వాళ్ల పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇంకా గల్ఫ్‌ అప్పులు బాధిస్తూనే ఉన్నాయి. ప్ర భుత్వం తమలాంటి వాళ్లను ఆదుకోవాలని కిషన్‌ వేడుకుంటున్నాడు. 

- ఎర్ర శ్రీనివాస్, గంభీరావుపేట

మరిన్ని వార్తలు