ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదు...

22 Dec, 2017 13:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ ను  రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. గత ఏడాది తిరుపతిలో ఈ సమావేశాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాలకు సంబంధించిన వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఏడుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అన్ని ఏర్పాట్లు చేసి ప్రతినిధుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇపుడు వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. 

దేశ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం నిర్ణయం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారంటూ ఇలాంటి సభలు నిర్వహించకపోవడం తెలంగాణకు అవమానం అని ఆవేదన వ్యక‍్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదని, ద్వేషపూరితంగానే ఓయూలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌ను కేసీఆర్ వాయిదా వేశారన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విద్యార్థులతో బీజేపీ మాట్లాడుతుందని చెప్పారు. 

టీఆర్ఎస్ మహా సభలా
​ప్రపంచ తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహా సభలులాగా జరిగాయని, ఒక లక్ష్యం లేకుండా నిర్వహించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలుగు మహాసభ పేరుతో సీఎం సొంత భజన చేసుకున్నారని, రాచరికపు పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంకు ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించిందా అని ప్రశ్నించారు. తెలుగు కళాశాలకు ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని నిలదీశారు. టిఆర్ఎస్ నాయకులను ఏ అర్హతతో ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ వేదిక కింద ఉంటారు.. అసదుద్దీన్ ఒవైసీ వేదిక పైన ఉంటారు.. ఇవి ఏమి తెలుగు మహాసభలోఅర్థం కాలేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, మొదటి పొగడ్త కేసీఆర్‌కు వస్తే రెండో పొగడ్త నిజాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు