13 నుంచి కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌

29 Dec, 2019 01:43 IST|Sakshi

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం బ్రాండ్‌ ఇమేజ్‌ని మరింత పెంచే లా కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ఇంటర్నేషనల్‌ కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్‌ కైట్, ఇంటర్నేషనల్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ 2020 నిర్వహణపై శనివారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ ఫెస్టివల్‌ను సందర్శించడానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఆ దేశాల స్వీట్స్‌ వెరైటీలను ప్రదర్శనలో పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ నగరంలో స్థిరపడి ఉన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు స్వీట్‌ ఫెస్టివల్‌లో పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని, ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటుతో పాటు నిర్వహణ చేపట్టాలన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు