రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్లు

14 Mar, 2020 03:41 IST|Sakshi
అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు అభ్యర్థి కేకేతో పాటు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న దానం, పాషా ఖాద్రీ, తలసాని, కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పక్షాన నాలుగు సెట్లు దాఖలు

నామినేషన్‌ పత్రాలపై టీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేల సంతకాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. టీఆర్‌ఎస్‌ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్‌ కె.కేశవరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు వెంటరాగా అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పక్షాన 4 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు కాగా.. కేకే, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులు, టీఆర్‌ ఎస్, ఏఐఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒక్కో సెట్‌పై 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా, ఒక్కో సెట్‌పై నలుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కుమారులు వెంకట్, విప్లవ్‌.. సురేశ్‌రెడ్డి సతీమణి పద్మజారెడ్డి అసెంబ్లీకి వచ్చిన వారిలో ఉన్నారు.

కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యుల భేటీ.. 
నామినేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి పార్టీ అభ్యర్థులు కేకే, సురేశ్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని సీఎం చాంబర్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్‌ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అసెంబ్లీ లాబీల్లో ఎంపీలు సంతోష్, బండా ప్రకా శ్, లింగయ్య యాదవ్‌ ఇప్పుడు మనం సీనియర్లం అయ్యాం అంటూ సరదాగా అన్నారు. కాగా, నామినేషన్‌ దాఖలుకు ముందు కేకే, సురేశ్‌రెడ్డి గన్‌ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళుల ర్పించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, విప్‌ బాల్క సుమన్, గువ్వ ల బాలరాజు తదితరులతో అసెంబ్లీకి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు.


అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు అభ్యర్థి సురేశ్‌రెడ్డితో పాటు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న హరీశ్‌రావు తదితరులు

ఎన్నిక కావడం లాంఛనమే... 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరితో పాటు శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజ్‌ కోయల్కర్‌ ఒక్కో సెట్టు దాఖలు చేశారు. ఇలా మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లయింది. 16న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా టీఆర్‌ఎస్‌కు 104, ఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం ఉండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే కానున్నది.

మరిన్ని వార్తలు