టీఆర్‌ఎస్‌లో ఐక్యతా రాగం

14 Nov, 2018 15:59 IST|Sakshi
ప్రతాపుసింగారంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మల్లారెడ్డి

తాజా మాజీ ఎమ్మెల్యే నివాసంలో ముఖ్య నాయకుల భేటీ

మేడ్చల్‌ అభ్యర్థిగా ఎంపీ మల్లారెడ్డికి లైన్‌ క్లియర్‌

నేడు బోడుప్పల్,కీసరలో పార్టీ సమావేశాలకు నిర్ణయం  

సాక్షి,మేడ్చల్‌ జిల్లా/ఘట్‌కేసర్‌:  మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌లో ఐక్యతా రాగానికి పార్టీ అధిష్టానం నడుం బిగించింది. దీంతో  మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్టిగా ఎంపీ మల్లారెడ్డికి లైన్‌ క్లియర్‌ అయినట్లయింది. పార్టీ  ‘బి’ ఫారం కూడా బుధవారం మల్లారెడ్డికి అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా,  నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి బెడదను  చక్కబెట్టుకోవాలని ఎంపీ మల్లారెడ్డికి అధిష్టానం సూచించినట్లు సమాచారం. అందులో భాగంగా  మంగళవారం ప్రతాప్‌ సింగారంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులతో ఎంపీ మల్లారెడ్డి సమావేశమయ్యారు. ఇందులో నాయకులు,  పార్టీ ప్రజాప్రతినిధులు వెలుబుచ్చిన అభిప్రాయాలు, సూచనలను ఎంపీ మల్లారెడ్డి అంగీకారం తెలిపినట్టు తెలిసింది.

నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న మండల పార్టీ కమిటీలను యథాతథంగా కొనసాగించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే, మండల కమిటీలు సూచించిన వారికి అవకాశం కల్పించాలని చేసిన సూచనలు, సలహాలను పాటించే విషయమై సమావేశంలో  సంసిద్ధత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్, పీర్జాదిగూడ  మున్సిపాలిటీలతోపాటు మిగతా నాలుగు మండలాల్లో పార్టీ  ప్రచార కమిటీలను నియమించేందుకు సంయుక్తంగా బుధవారం బోడ్పుల్‌లో రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన నాయకులు ,కార్యకర్తల సమావేశం, కీసరలో నాలుగు మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మేడ్చల్‌ అభ్యర్థిగా ఎంపీ మల్లారెడ్డి నామినేషన్‌ దాఖలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.  

సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులతోపాటు మేడ్చల్‌ మున్సిపాలిటీ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అ«ధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, ఎంపీపీలు చంద్రశేఖర్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, పలువురు ముఖ్య నాయకులు హాజరు కాగా, మాజీ ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్న బోడుప్పల్‌ , పీర్జాదిగూడ  మున్సిపాలిటీలకు చెందిన  నాయకులు జేడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, దర్గ దయాకర్‌రెడ్డి గైర్హాజర్‌ అయినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు