మసకబారిన మానవత్వం!

10 Jul, 2020 10:56 IST|Sakshi
రత్నమ్మ (ఫైల్‌)

ప్రాణం కంటే ఆస్తులపైనే మమకారం

ఓ వృద్ధురాలిని బలిగొన్న భూవివాదం

ధైర్యంగా వీడియో చిత్రీకరించిన చిన్నారి

వనపర్తి: మానవత్వాన్ని పక్కన పెట్టి ఆస్తుల కోసం విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్న రోజులు దాపురించాయి. ఇందుకు నిదర్శనం గోపాల్‌పేట మండలం బుద్దారంలో చోటుచేసుకున్న ఘటనే. ఆస్తి కోసం ఓ వృద్ధురాలిపై సమీప బంధువే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనతో ఒక్కసారిగా జిల్లా ప్రజలు ఉలికిపడ్డారు. చివరకు బాధితురాలు రత్నమ్మ (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘర్షణను ఆపేందుకు ఓ వ్యక్తి యత్నించి గాయాలపాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి ధైర్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో ఈ సంఘటన ఎంత అమానవీయంగా ఉందనేందుకు అద్దం పడుతోంది. సాటి మనిషి రక్తం మడుగులో పడి ఉన్నా.. కసితీరా కత్తితో దాడి చేస్తారా.. అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా ఒల్లు జలదరించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూపులలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఆలస్యం కావడానికి కారణమేమిటి?  
రత్నమ్మ (60), భర్త అనంతరావుపై బంధువులే దాడి చేస్తున్నారని గ్రామస్తులు వెంటనే 100 నంబర్‌కు డయల్‌ చేసి సమాచారం ఇస్తే.. మండల కేంద్రానికి 5కి.మీ. ఉన్న బుద్దారానికి చేరుకునేందుకు గంట సమయం ఎందుకు పట్టిందనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో ప్రధాన నిందితులతో గోపాల్‌పేట పోలీసులకు లోపాయికారీ ఒప్పందాలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలకు మరింత బలాన్నిస్తున్నాయి. 

భూముల ధరలకు రెక్కలు  
జిల్లాల ఏర్పాటు, సమృద్ధిగా సాగునీటి వనరులు పెరగటంతో వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఇటీవల కాలంలో ఆస్తి పంచాయితీలు, భూముల్లో వాటాలు, హక్కులపై కోర్టులో, పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఓ నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది.

గాయపడిన మహిళ మృతి
గోపాల్‌పేట (వనపర్తి): భూ వివాదంలో బుధవారం దాడికి గురై హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుద్దారానికి చెందిన రత్నమ్మ (60) గురువారం మధ్యాహ్నం మృతి చెందిందని ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ తెలిపారు. ఈ దాడికి పాల్పడిన అర్జున్‌రావు, శేషమ్మ, నరేందర్‌రావు, ప్రశాంత్‌ను నాగర్‌కర్నూల్‌ జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టామన్నారు. అనంతరం నలుగురిని మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించామన్నారు. 

బుద్దారంలో పోలీసుల పహారా
భూ వివాదంలో హత్యకు గురైన రత్నమ్మ (60) సంఘటనతో బుద్దారం గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఇలాంటి గొడవలు లేకుండా చూడాలని మహిళలు, గ్రామస్తులు గురువారం రాత్రి రోడ్డుపై గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. సీఐ సూర్యనాయక్, ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ అక్కడికి చేరుకుని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని వారికి సర్ది చెప్పారు. కరోణా వైరస్‌ ప్రబలుతున్నందున ఇలా గుమికూడవద్దని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. గ్రామంలో పోలీసులు పహారా కాశారు.   

నిందితులకు శిక్షపడేలా చూస్తాం  
బుద్దారం ఘటనపై సమగ్ర విచారణ చేస్తాం. ఈ కేసులో నిందితులకు శిక్షపడేలా చూస్తాం. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భవిష్యత్‌తో ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం.   – కె.అపూర్వారావు, ఎస్పీ, వనపర్తి

మరిన్ని వార్తలు