ఆమ్నెస్టీపై కార్మికులకు అవగాహన

9 Jul, 2018 13:59 IST|Sakshi
దుబాయ్‌లో తెలంగాణ కార్మికులతో సమావేశమైన నంగి దేవేందర్‌రెడ్డి 

మోర్తాడ్‌: యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)పై కార్మికులకు ప్రధానంగా తెలంగాణ జిల్లాల వారికి అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది.

యూఏఈ పరిధిలోని వివిధ పట్టణాల్లోని కార్మికుల క్యాంపుల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఆమ్నెస్టీని సద్వినియోగం చేసుకుని స్వదేశానికి రావడం లేదా వీసా, వర్క్‌ పర్మిట్‌లను పునరుద్ధరించుకుని ఉపాధి పొందాలనే సూచనలతో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ప్రతినిధుల అవగాహన శిబిరాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ కార్మికుల కోసం నిర్వహిస్తున్న అవగాహన శిబిరాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీపీసీసీ గల్ఫ్‌ కన్వీనర్‌ నంగి దేవేందర్‌ రెడ్డి ‘సాక్షి’తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ బీఎం వినోద్‌ కుమార్‌ సలహా మేరకు తాను దుబాయ్‌లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.

షార్జాలోని సోనాపూర్‌ శిబిరానికి దుబాయ్‌లోని తమ ప్రతినిధి ముత్యాల మారుతి ఆధ్వర్యంలో ఈరోజు వెళ్లి కార్మికులకు ఆమ్నెస్టీ విధి విధానాలపై అవగాహన కల్పించామన్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా తదితర పట్టణాల్లో ఉంటున్న తెలంగాణ జిల్లాలకు చెందిన కల్లిబిల్లి కార్మికులు యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు నంగి దేవేందర్‌ రెడ్డి తెలిపారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణలోని గల్ఫ్‌ కార్మికుల కోసం కాంగ్రెస్‌ పార్టీ రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు మేనిఫెస్టోలో పేర్కొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై కార్మికులకు వివరిస్తున్నామని వెల్లడించారు. యూఏఈలో ఐదేళ్ల విరామం తరువాత అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ఆగష్టు ఒకటో తేదీ నుంచి మూడు నెలల పాటు అమలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.

ఆమ్నెస్టీపై ఇటీవలే యూఏఈ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ప్రొటెæక్ట్‌ యువర్‌ సెల్ఫ్‌ వయా రెక్టిఫై యువర్‌ స్టేటస్‌’ అనే కార్యక్రమం ద్వారా యూఏఈ ప్రభుత్వం చట్ట విరుద్దంగా ఉన్న విదేశీ కార్మికుల కోసం ఆమ్నెస్టీని ప్రకటించింది. ఈ ఆమ్నెస్టీతో ఎక్కువగా ప్రయోజనం పొందే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఉండటం విశేషం.  

మరిన్ని వార్తలు