ప్రొ. కోదండరాం అరెస్ట్‌

6 Aug, 2018 18:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్‌తో ములాకత్‌ అయ్యేందుకు వెళుతున్న కొదండరాంను అరెస్ట్‌ చేసి బిక్కనూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం సరికాదని కోదండరాం అన్నారు. పోచంపాడు నుంచి కనీసం లీకేజి అవుతున్న నీటిని వాడుకుంటామన్న 21 గ్రామాలను పోలీస్ స్టేషన్లను తలపించేలా 144 సెక్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రైతుల సమస్యలపై అండగా ఉన్న రైతుసంఘం నాయకుడు, న్యూ డెమోక్రసీ నేత ప్రభాకర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించడం తగదన్నారు. కోదండరాంను హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ జన సమితి నేతలను ఉంచారు. శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు.

దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపటినుంచి ఐదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆందోళనలకు అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు.

మరిన్ని వార్తలు