రామగుండం నుంచి కోదండరాం? 

31 Oct, 2018 02:48 IST|Sakshi

తెలంగాణ జన సమితికి 8 సీట్లు ఖరారు!

మరో 4 సీట్ల కోసం ఆ పార్టీ పట్టు 

కోదండరాం అధ్యక్షతన టీజేఎస్‌ స్టీరింగ్‌ కమిటీ భేటీ

కోరిన స్థానాలపై అన్ని మార్గాల్లో ప్రయత్నిద్దామన్న నేతలు

అది కుదరకుంటే భవిష్యత్‌ కార్యాచరణపై కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్‌ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం. కోదండరాం పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. మరోవైపు తమకు కనీసం 12 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోదండరాం పట్టుబడుతున్నారని తెలుస్తోంది.

తమకు చెన్నూరు, ఆసిఫాబాద్, దుబ్బాక, షాద్‌నగర్‌ లేదా మెదక్‌ నియోజకవర్గాలను ఇవ్వాలని కోదండరాం గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పోటీలో దించడానికి తమకు తగిన సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారని తెలియవచ్చింది. మరోవైపు చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి నియోజకవర్గాలు తాము కోరుకోవడం లేదని, ఆ సీట్లను కూడా మార్చాలని టీజేఎస్‌ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏదైనా నియోజకవర్గాన్ని మార్చి మహబూబ్‌నగర్‌ను ఇవ్వాలని వారు అడుగుతున్నట్లు సమాచారం. మరో రెండు సీట్లను పెంచడానికి కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగానే ఉందని, అదే సమయంలో సీట్లను కూడా మార్చాలని తాము కోరుతున్నట్లు టీజేఎస్‌ నేతలు చెబుతున్నారు.  

టీజేఎస్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం... 
సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు ఇంకా పూర్తికాకపోవడం, కోరిన సీట్లు ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ లభించని నేపథ్యంలో టీజేఎస్‌ స్టీరింగ్‌ కమిటీ మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరిపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీపై కాంగ్రెస్‌ అధిష్టానం ఒత్తిడి తేవాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కోరిన సీట్ల సంఖ్య, కోరిన నియోజకవర్గాలను సాధించుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా సీట్ల సర్దుబాటు పూర్తికాకుంటే భవిష్యత్‌ కార్యాచరణ గురించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. 

మరిన్ని వార్తలు