ఉచిత విద్య ప్రభుత్వ బాధ్యత

9 Dec, 2017 03:19 IST|Sakshi

పీడీఎస్‌యూ 21వ రాష్ట్ర మహాసభల్లో కోదండరాం

రాష్ట్రంలో పాఠశాల స్థాయిలోనే 48% మంది మధ్యలో చదువు మానేస్తున్నారు

తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎలా మారుతుంది?

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు, ఉపాధ్యాయులు లేక ఎందరో విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఇలా దేశంలో వందకు 52 మంది.. రాష్ట్రంలో 48 మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారని తెలి పారు. పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎప్పుడు మారుతుం దని ప్రశ్నించారు.

శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పీడీఎస్‌యూ 21వ రాష్ట్ర మహాసభలో ఆయన ప్రసంగించారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అక్షరాస్యతలో దేశంలోనే వెనుకబడి ఉందని, ఇది భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాలంటే పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన విద్య అందుతుందని పిల్లల్ని ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తే అక్కడ ర్యాంకుల వేటలో ఒత్తిడి తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లను గురుకులాలుగా తీర్చిదిద్ది పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్‌ చేశారు.

భవనాలపై ఉన్న మోజు విద్యారంగంపై ఏదీ?
రాష్ట్ర ప్రభుత్వం భవనాల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యం విద్యారంగానికి ఇవ్వ డం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేయకుండా నిరుపేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు.

పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌ మాట్లాడుతూ.. కళాశాల, పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు బస్సు సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.    మహాసభల సందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి జెడ్పీ మైదానం వరకు  విద్యా ర్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాట ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.రంగారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు