నాలుగు స్థానాల్లో టీజేఎస్‌ పోటీ

14 Mar, 2019 03:29 IST|Sakshi

కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరిపై స్పష్టత 

మూడు స్థానాలుఖరారు చేసిన టీజేఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అందులో మూడు స్థానాలను టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఖరారు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, మరొక స్థానాన్ని ఖరారు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆసిఫాబాద్‌ లేదా భువనగిరిలో పోటీ చేసే అంశాలను టీజేఎస్‌ పరిశీలిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో ఆ రెండింటిలో ఏదో ఒక స్థానంలో పోటీ చేసే విషయాన్ని పార్టీ ప్రకటించనుంది. మరోవైపు తాము పోటీలో లేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బయటినుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇప్పటివరకు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ శ్రేణులు ఒత్తిడితో పోటీలో ఉండాల్సి వస్తే కరీంనగర్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆ స్థానం నుంచి జగ్గారెడ్డిని పోటీలో నిలిపేందుకు పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. నిజామాబాద్‌ నుంచి గోపాలశర్మ, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ను పోటీలో నిలిపే అంశాలను పార్టీ పరిశీలిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల ప్రచారం కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో మానిటరింగ్, ఎలక్షన్‌ అండ్‌ పొలిటికల్‌ ఎఫైర్స్, క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల నేతృ త్వంలో ప్రచారం వేగవంతం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించింది.  

భవిష్యత్‌ లక్ష్యాల సాధన కోసమే పోటీ
ఈ ఎన్నికల్లో టీజేఎస్‌ సొంతంగా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని, పోటీలో ఉంటేనే భవిష్యత్తులో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ఉద్దేశంలో పోటీలో ఉంటామని కోదండరాం తెలిపారు. ఈ ఎన్నికల కోసం కొత్తగా మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టో కలిపి రీక్లెయిమింగ్‌ రిపబ్లిక్‌ పేరుతో కొత్త మేనిఫెస్టోను ఒకటీ రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. పార్టీ నిర్మాణానికి దోహదపడే చోటనే తమ అభ్యర్థులను పోటీలో నిలపాలని నిర్ణయించామన్నారు.

ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం యాత్ర నిర్వహిస్తామని, ఈనెల 16,17 తేదీల్లో భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రజల హక్కులకు రక్షణలేకుండా పోయిందన్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగలేదన్నారు. జాతీయ స్థాయిలో ఎవరితో వెళ్లాలన్న దానిపై తమ ప్రణాళికలు తమకు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ నేతలు దిలీప్‌కుమార్, యోగేశ్వర్‌రెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు