అరుదైన గౌరవం పొందిన కోయిలకొండ పోలీసులు

11 Dec, 2019 07:53 IST|Sakshi

టెక్నాలజీని అందిపుచ్చుకుని.. ప్రతీ కేసు ఆన్‌లైన్‌లో నమోదు

ఫిర్యాదు దారులకు మెరుగైన వసతులు

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ముందంజ

దేశంలోనే కోయిలకొండ  పోలీస్‌స్టేషన్‌కు 79వ స్థానం

ఇతర పారామీటర్లలోనూ ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రైం: అందరూ చేసే పని ఒక్కటే.. కానీ అందులో వైవిద్యం.. వేగం.. టెక్నాలజీని ఉపయోగించుకున్న వారికి మాత్రమే ప్రత్యేక గుర్తింపు, గౌరవం తక్కుతాయి. ఇలాంటి పద్దతినే కోయిలకొండ పోలీసులు ఎంచుకోవడం వల్ల జాతీయ స్థాయిలో 79స్థానం దక్కింది. ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పోలీస్‌ స్టేషన్లను ఎంపిక చేస్తోంది. 2019ఏడాదికి గాను దేశం మొత్తంలో 15,579 పోలీస్‌స్టేషన్లు ఉండగా.. అందులో జిల్లాలోని కోయిలకొండ పోలీస్‌ స్టేషన్‌కు 79వ స్థానంతో ఈ అరుదైన అవకాశం దక్కింది. అక్టోబర్‌లో  కేంద్రం బృందం సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ పరిశీలించి ప్రత్యేక రిపోర్టు తయారు చేసుకొని వెళ్లారు. వారం రోజుల కిందట విడుదల చేసిన జాబితాలో కోయిలకొండకు అవకాశం దక్కింది.

పెరిగిన టెక్నాలజీ వాడకం
మారుతున్న కాలనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే తీరు, కేసుల పరిశోదన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లను ఎంపిక చేస్తోంది. కొత్తగా వచ్చిన టెక్నాలజీ వాడకంలో కోయిలకొండ పోలీసులు ప్రత్యేక ముద్ర వేశారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ప్రతి కేసును ఆన్‌లైన్‌లో పొందుపరచడం, చాలా వరకు కేసులను పెండింగ్‌లో పెట్టకపోవడం వల్ల కార్యక్రమాలు చేపడుతున్నారు. నమోదు అయిన కేసు వివరాలను ఆయా ఫిర్యాదుదారులు సులువుగా ఆన్‌లైన్‌ చూసుకునే ఏర్పాటు కల్పించడం చేశారు. వచ్చిన ఫిర్యాదుదారులకు అవసరమైన వసతులు కల్పించడం, స్నేహపూర్వకమైన వాతావరణంలో నడపటం చేశారు. ప్రధానంగా  పోలీస్‌ వ్యవస్థను పటిష్టంగా ఉంచుతూ స్థానికంగా నేరాలను పూర్తిగా నియంత్రణ చేస్తూ వచ్చారు.  పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాతనే పకడ్బందీగా కేసులు నమోదు చేసి మంచి ఫలితలను సాధించడం, ఇందుకు తగ్గటుగా జాతీయ స్థాయిలో 79వ స్థానం సాధించారు.

పచ్చదనానికి కేరాఫ్‌

పోలీస్‌ స్టేషన్‌ మొత్తాన్ని పూర్తిగా పచ్చదనంతో నింపేశారు. వచ్చినవారికి కనువిందు చేసేలా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆలోచనను అమలు చేశారు. ఆవరణలో అందమైన పూల మొక్కలు, గడ్డి మొక్కలు నాటారు. నడిచేందుకు, వాహనం వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మార్గం మినహాయించి ఇతర ఖాళీ స్థలమంతా మొక్కలతో నింపేశారు. ఎప్పటికప్పుడు ఎండిన ఆకులను తొలగించడం, కొమ్మలను కత్తిరించడం, రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీటిని అందించడం చేస్తున్నారు.

బెస్ట్‌ ఇచ్చాం
దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీస్‌స్టేషన్‌లలో చాలా పోటీ ఉండింది. దీంట్లో కోయిలకొండ పోలీస్‌ స్టేషన్‌ నుంచి బెస్ట్‌ ఇచ్చాం. దీంతో ఆ పోటీలో మాకు స్థానం దక్కింది. కొన్ని పారామీటర్స్‌లలో ఉత్తమ పనితీరు చూసి ఎంపిక చేశారు. కేంద్రం నుంచి అవార్డును కూడా అందజేస్తారు. – రెమా రాజేశ్వరి, జిల్లా ఎస్పీ

అందరి కృషితోనే
ఉమ్మడి జిల్లా నుంచి కోయిల్‌కొండ పోలీస్‌స్టేషన్‌కు స్థానం దక్కడం జిల్లా పోలీస్‌శాఖకు దక్కిన గౌరవం. దేశ వ్యాప్తంగా  కోయిల్‌కొండ స్టేషన్‌కు 79వ స్థానం రావడం ఆనందంగా ఉంది. ఈ స్థానం రావడం వెనుక ఇక్కడ పని చేసే సిబ్బందితో పాటు ఉన్నత అధికారుల కృషి ఉంది. – సురేష్, ఎస్‌ఐ, కోయిలకొండ
 

మరిన్ని వార్తలు