అవసరమైతే హైకోర్టుకు వెళ్తా

26 Aug, 2019 03:26 IST|Sakshi

పాదయాత్రపై ఎంపీ కోమటిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేటి నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించాల్సిన ‘రైతు సాధన యాత్ర’పై టెన్షన్‌ నెలకొంది. నల్లగొండ పట్టణ శివారు ఉదయసముద్రం నుంచి హైదరాబాద్‌లోని జలసౌధ వరకు వేలాది మంది రైతులతో కలిసి ఆయన నిర్వహించాలనుకున్న పాదయాత్రకు పోలీసులు అను మతి నిరాకరించారు. హైవేపై యాత్ర నిర్వహిస్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, తాను మాత్రం యాత్ర నిర్వహించి తీరుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

తన పాదయాత్రపై ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని, పాదయాత్రకు అనుమతి నిరాకరించడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తన స్వేచ్ఛను హరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, హైకోర్టు నుంచి అనుమతి తీసుకునయినా పాదయాత్ర చేసి తీరతానని ఆయన స్పష్టం చేశారు. 

నేడు తుమ్మిడిహెట్టికి టీపీసీసీ..  
కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టేందుకుగాను టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తుమ్మిడిహెట్టి యాత్ర నేడు జరగనుంది. ఈ యాత్రలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.  

మరిన్ని వార్తలు