జిల్లా అభివృద్ధిపై సీఎంతో చర్చించా

18 Aug, 2019 13:29 IST|Sakshi
కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి

ఇంటికి రావాలని ఆహ్వానించిన సీఎం

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధితో పాటు సాగు, తాగు నీటి సమస్యపై సీఎం కేసీఆర్‌తో చర్చించానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. శనివారం యాదాద్రి పనుల పర్యవేక్షణకు యాదగిరిగుట్టకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను ఆయన కలిశారు. హరిత భవన్‌లో సుమారు గంట సేపు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి చర్చిం చినట్లు వివరించారు. శ్రీశైలం సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లంల, బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. భువనగిరి, ఆలేరు ప్రాంతం సాగు, తాగు నీటి ఇబ్బందితో అల్లాడుతుందని, వెయ్యి ఫీట్ల వరకు బోర్లు వేసినా చుక్క నీరు లేదన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్‌ ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదని, అప్పటి వరకు ప్రజల ఇబ్బందులు తీర్చడానికి తపాసుపల్లి రిజర్వాయర్‌ ద్వారా నీరు అందించాలని కోరారు.  శ్రీశైలం సొరంగ మార్గానికి రూ.2 వేల కోట్లకు రూ.13 వందల కోట్లు ఖర్చు చేశామని, బ్రాహ్మణ వెల్లంల రూ.200 కోట్లతో పనులు జరిగి ఆగిపోయాయని తెలిపినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ రెండు, మూడు రోజుల్లో తన ఇంటికి రావాలని కోరినట్లు తెలిపారు. అలాగే సీఎంతో ప్రత్యేక సమావేశంలో రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు చాలా అంశాలు ఉంటాయని, అవి బయటకు చెబు తారా అంటూ నవ్వుకుంటూ వెళ్లి పోయారు.  సమావేశంలో ఎంపీపీ చీర శ్రీశైలం, వైస్‌ ఎంపీపీ ననబోలు ప్రసన్నరెడ్డి, అండెం సంజీవరెడ్డి, జనగాం ఉపేందర్‌రెడ్డి, బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు