‘ఆయన పార్టీ మారడం బాధకు గురిచేసింది’

19 Mar, 2019 18:48 IST|Sakshi

సాక్షి, భునవనగిరి: కేంద్రంలోని బీజేపీకి అండగా నిలుస్తోన్న టీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కోట్ల రుపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.700 కోట్లు విలువ చేసే బ్రాహ్మణ వెళ్లాంల ప్రాజెక్టుని తెచ్చినట్లు గుర్తుచేశారు. కానీ ఐదేళ్లు గడిచిన కేసీఆర్‌ మాత్రం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. నల్గొండను దత్తత తీసుకుంటా అని గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రకటించారని, నాలుగు నెలలు గడిచినా దాని ఊసే లేదని విమర్శించారు.
చదవండి: నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో ఎవరి బలమెంత..? 

గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌లో తాము పోరాడి గెలచామని, అనంతరం చిరమర్తి లింగయ్య పార్టీ మారడం తనను ఎంతో బాధకు గురిచేసిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తున్నారని, 15 రోజుల్లోనే ఆరుకోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. నకిరేకల్‌ కోసం అన్నదమ్ములిద్దరం ప్రాణాలైన ఇస్తాం కానీ.. ఇక్కడి ప్రజలను మాత్రం వదిలివెళ్లమని స్పష్టం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 22న భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా తమను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకున్నారని కాంగ్రెస్‌ ఎమెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి విమర్శించారు. తమ సొంతమనిషి అయిన చిరుమర్తి లింగయ్యను తీసుకెళ్లి.. తమ కుటుంబంలో చిచ్చులు పెట్టిన కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పదవులకు ఆశపడ్డి కొంతమంది నాయకులు పార్టీని విడిచి పోవచ్చని, కేసీఆర్‌ను ఓడించడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

మరిన్ని వార్తలు