ఎయిమ్స్‌కు నిధులివ్వండి

7 Jan, 2020 01:40 IST|Sakshi
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం ఇస్తున్న కోమటిరెడ్డి

కేంద్ర ఆర్థిక మంత్రికి కోమటిరెడ్డి వినతి

సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌లో నిర్మితమవుతున్న ఎయిమ్స్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలల శాశ్వత భవనాలకు కేంద్ర బడ్జెట్‌లో రూ.1,028 కోట్ల నిధులను కేటాయించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సోమవారం ఆయన ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి పలు వినతి పత్రాలు అందించారు. కాంగ్రెస్‌ హయాంలో హైదరాబాద్‌లో మంజూరైన ఐటీఐఆర్‌ హబ్‌కు నిధులు కేటాయించాలని కోరారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్ల ఏర్పాటుకు వీలుగా రూ.1,013 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు.

హైదరాబాద్‌–వరంగల్‌ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్‌ జ్యోతి బీమా యోజన పథకాల కింద చేనేత కార్మికులకు, 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వారికి ఆరోగ్య బీమా పథకం వర్తించేలా చర్యలు చేపట్టాల న్నారు. మూసీ నది ప్రక్షాళనకు ‘నమామి గంగా‘తరహాలో మిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు