ప్రధానికి కాంగ్రెస్‌ ఎంపీ అభినందనలు

20 May, 2020 15:11 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌' ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.   

‘కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2019 గణంకాల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలి. సంప్రదాయంగా  ఇదే వృత్తిని నమ్ముకున్న చేనేత  వృత్తిదారులలో  ఆధిక శాతం పేదవారు ఉన్నారు. ఇందులో 67 శాతం మంది రూ.5,000 లోపు , 26.2 శాతం రూ.10,000 లోపు, 6.8 శాతం మాత్రమే రూ.10,000 పైన ఆదాయం పొందుతున్నారు.  

మన దగ్గర తయారైన ఉత్పత్తులను మన దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. లాక్ డౌన్ కారణంగా ముడి సరుకుల రవాణా లేక, పని లేక చేనేత , చేతి వృత్తిదారులకు ఉపాధి కరువైంది. ఇదే వృత్తిని నమ్ముకున్న వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే ముడి సరుకుల కొనుగోలు ద్వారా అయా వృత్తులు తిరిగి గాడిలో పడుతాయి. నెలకు రూ. 3,000ల చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సాయం, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందించాలి. దేశంలోని 23 కోట్ల బీపీఎల్‌ కుటుంబాలకు దోతిలు, చీరలు అందజేయాలని, వీటిని తయారు చేసే బాధ్యతను చేనేత, చేతివృత్తిదారులకు అప్పగించాలి’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

చదవండి:
భారత్‌పై నేపాల్‌ ప్రధాని షాకింగ్‌ కామెంట్లు!

బస్సుల గోల.. కాంగ్రెస్‌పై అదితి ఫైర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు