పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలి: విశ్వేశ్వర్ రెడ్డి 

10 Dec, 2018 18:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనపై టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కూటమి గెలుస్తుందనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డే తనకు ఫోన్‌ చేశారన్నారు. మర్రి జనార్ధన్‌ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలని విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో అమ్ముడుపోయే వ్యక్తిత్వమా మర్రిజనార్థన్‌ రెడ్డిది అని ప్రశ్నించారు. మర్రి జనార్ధన్‌ రెడ్డి గెలిచే అవకాశం లేదు. ఆ టెన్షన్‌లోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

తనకు సుమారు 50 మంది టీఆర్‌ఎస్‌ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే ఆరోపణలు చేసినట్టుగా ఉందన్నారు. తాను మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్‌ రికార్డులను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈసారి వదిలేస్తున్నా.. మరోసారి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నేతలు టెన్షన్‌లో ఉన్నారన్నారు. ఓడిపోతామనే భయంలో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు