కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని!

10 Jul, 2019 14:03 IST|Sakshi
కొండగట్టు ఆలయ ప్రవేశ ద్వారం

మూడేళ్లుగా కాగితాలకే పరిమితం  

కనీస వసతులు లేక భక్తుల ఇబ్బందులు 

సీఎం రాక కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు 

సాక్షి, మల్యాల(చొప్పదండి): కొండగట్టుపై వెలిసిన అంజన్నను దర్శించుకుంటే శని వదిలి అంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అయితే భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని మూడేళ్లుగా వీడడం లేదు. సీఎం వస్తే తప్పా పరిస్థితిలో మార్పు రాదనే భావన భక్తుల్లో నెలకొంది.   

కొండగట్టు పుణ్యక్షేత్రం మాస్టర్‌ప్లాన్‌ కాగితాలకే పరిమితమైంది. నివేదిక రూపొందించి దేవాదాయ శాఖకు సమర్పించి మూడేళ్లు గడుస్తున్నా..నేటికీ మాస్టర్‌ప్లాన్‌ అమలు ఊసే లేదు. కొండగట్టు పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్‌ వస్తేనైనా మాస్టర్‌ప్లాన్‌ అమలుకు నోచుకుంటుందనే ఆశతో భక్తులు ఎదురుచూస్తున్నారు. టూరిజం డెవలప్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో రోప్‌ నిర్మాణం ప్రతిపాదనలు చేసి, ఐదేళ్లయినా అతీగతీలేదు.

మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. కొండగట్టులో భక్తులసంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఏటా వేలాది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు.   

మాస్టర్‌ప్లాన్‌ అమలెప్పుడో? 
భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం ముందుకు సాగడం లేదు. కొండగట్టు ఆలయ పరిధిలో ప్రభుత్వ భూమి 333 ఎకరాలు ఉంది. వీటిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సుమారు  రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. మూడేళ్లు గడుస్తున్నా మాస్టర్‌ప్లాన్‌ అమలుకు నోచుకోవడం లేదు. కాగితాలకే పరిమితమైంది.   

మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వస్తే.. 
కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వస్తే, భక్తులకు మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. భక్తులుకోసం 100 గదుల వసతి గృహం, మెట్లదారి వెంట రూఫ్‌ వేయనున్నారు. రోప్‌ వే నిర్మాణం, ఆలయ రెండో ప్రాకారం నిర్మాణం, కొండగట్టు దిగువన ఆర్చి గేటు నిర్మాణం, నిత్యాన్నదాన సత్రం భవనం, అభిషేక మండపం, సంతోల్లలొద్ది నుంచి గుట్టపైకి నీటిసరఫరా పైపులైన్, రెండస్తుల దీక్ష విరమణ భవనం, పార్కింగ్‌ స్థలం అభివృద్ధి, రెండు డార్మిటరీ హాళ్ల నిర్మాణం, యాత్రికులకోసం 500 గదుల భవనం, వీఐపీలకోసం 50 ఏసీ సూట్స్‌ నిర్మాణం, రెండు ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటు, దేవాలయం ఆవరణలో క్యూలైన్ల కంపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేయనున్నారు.  

సీఎంకోసం ఎదురుచూపులు  
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తారంటూ మూడేళ్లు గడుస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం ఆలయాలకు వచ్చినప్పటికీ, కొండగట్టుకు మాత్రం సీఎం రాకపోవడంపై భక్తులు నిరాశలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ కొండగట్టుకు వస్తారంటూ చెబుతున్నా, నేటికీ నెరవేరడం లేదు.  

మాస్టర్‌ ప్లాన్‌ నివేదిక అందజేశాం 
కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన నివేదిక దేవాదాయశాఖకు అందజేసినం. మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వస్తే ఏటా పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతిగృహం, పార్కింగ్‌ స్థలం, మెట్లదారిలో రూఫ్‌ అందుబాటులోకి వస్తాయి.
                                        – అమరేందర్, కొండగట్టు ఆలయ ఈవో  

మరిన్ని వార్తలు