మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి

1 Jul, 2019 01:50 IST|Sakshi

సిర్పూర్‌ ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ, అనుచరుల వీరంగం

 కాగజ్‌నగర్‌ మండలం సార్సాలలో అటవీ అధికారులపై దాడి

 దాడిలో విరిగిన ఎఫ్‌ఆర్‌వో అనిత చేయి.. నెత్తురోడుతున్నా వదలని వైనం 

 ఘటనపై అధిష్టానం సీరియస్‌.. రాజీనామా చేయాలని కృష్ణకు ఆదేశం

 జెడ్పీ వైస్‌చైర్మన్, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణ 

16 మందిపై కేసులు నమోదు.. కృష్ణ, మరొకరి అరెస్టు 

కాగజ్‌నగర్‌ డీఎస్పీ, రూరల్‌ సీఐపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేట

బాధ్యులెవరైనా చట్టం ముందు సమానమే: కేటీఆర్‌ ట్వీట్‌

 రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ మండిపడ్డ విపక్షాలు

సాక్షి, ఆసిఫాబాద్‌: పోడు భూమి రణరంగమైంది. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్‌ అధికారుల బృందంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా అటవీ అధికారిణి చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల అటవీ ప్రాం తంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార పార్టీ నాయకుడు, సాక్షాత్తూ జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్, ఎమ్మెల్యే సోదరుడు ఇందుకు బాధ్యుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

ఈ ఘటనపై అటు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. అటవీ అధికారులపై దాడి చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానులేనంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేయగా, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద అరెస్టు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటన స్థానిక పోలీసు అధికారులకు కూడా చిక్కు తెచ్చిపెట్టింది. ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఘటనాస్థలంలో పోలీసు బందోబస్తు ఉండి కూడా ఘర్షణను నివారించి దాడిని అడ్డుకోలేకపోవడంతో కాగజ్‌నగర్‌ డీఎస్పీ, రూరల్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మహిళా అధికారిణి చేయి విరిగేలా కర్రలతో దాడి చేసిన ఈ ఘటన కారణంగా కోనేరు కృష్ణ ఇటీవలే వచ్చిన జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దాడికి ముఖ్య కారకుడైన కోనేరు కృష్ణతో పాటు 16 మందిపై కేసులు నమోదయ్యాయి. 

ఇదీ జరిగింది!
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ రేంజ్‌ పరిధి కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాలలో.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కోల్పోయిన అటవీ ప్రాంతానికి బదులు ఇక్కడ మొక్కలు నాటాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఎఫ్‌ఆర్వో అనితతోపాటు సిబ్బంది గ్రామ శివారు కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 138, 139లలో 20 ఎకరాల భూమిని చదును చేయించేందుకు ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మూడు ట్రాక్టర్లతో వెళ్లారు. దీంతో అదే స్థలంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న సార్సాల గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకుని అటవీ అధికారులను అడ్డుకున్నారు. అటవీ అధికారుల సమాచారంతో కాగజ్‌నగర్‌రూరల్‌ సీఐ వెంకటేశ్, టౌన్‌ సీఐ కిరణ్‌కుమార్, కాగజ్‌నగర్‌రూరల్‌ ఎస్సై రాజేశ్వర్‌ అక్కడకు చేరుకుని అటవీ అధికారులు చదును చేసేలా చూశారు. దీంతో విషయం తెలుసుకున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణరావు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు.

ప్రాధేయపడినా కనికరించలేదు
కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు వచ్చిరాగానే కర్రలతో అటవీ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. చెప్పేది వినాలని ట్రాక్టర్‌పైకి ఎక్కి వివరించేందుకు ప్రయత్నించిన ఎఫ్‌ఆర్వో అనితను విచక్షితరహితంగా కొట్టారు. దీంతో ఆమె కుడి చేయి విరిగిపోయింది. చూపుడు వేలు, మధ్య వేలు చిట్లిపోయాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు పలువురు అటవీ సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఎఫ్‌ఆర్వోను కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందించారు. కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో రాజరమణారెడ్డి ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశారు. కోనేరు కృష్ణను అరెస్టు చేసి జైనూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు బాధ్యతలను ఆసిఫాబాద్‌ డీఎస్పీకి అప్పగించారు.

పోలీసుల ప్రేక్షక పాత్ర
అటవీ అధికారులపై కోనేరు కృష్ణ, అతని అనుచరులు విచక్షణారహితంగా కర్రలతో దాడులకు పాల్పడుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం. వీడియోల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ సాంబయ్య, రూరల్‌ సీఐ వెంకటేశ్‌పై నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్‌ వేటు వేశారు.

అధిష్టానం సీరియస్‌
అటవీ అధికారులపై దాడి ఘటనపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పందించింది. జెడ్పీవైస్‌చైర్మన్‌తో పాటు జెడ్పీటీసీ పదవికి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోనేరు కృష్ణారావును ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామాను పార్టీ నాయకులతో జెడ్పీ సీఈవో రాజేశ్వరికి పంపారు. అనంతరం కోనేరు కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ కావాలనే అటవీ అధికారులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందిస్తూ.. ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న వారిపై అటవీ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న వారి భూముల్లో మొక్కలు నాటడం దారుణమన్నారు.

అంతా జీ హుజూర్‌ అనాల్సిందే
సిర్పూర్‌ నియోజకర్గంలో ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోని అధికారులకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గతంలో అక్రమ బెల్లం రవాణా అడ్డుకున్నందుకుగాను ఎమ్మెల్యే తన అనుచరులతో అప్పటి ఎక్సైజ్‌ అధికారిణి మంగను బహిరంగానే బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇక ప్రస్తుత ఎఫ్‌డీవోకు ముందు విధులు నిర్వర్తించిన నర్సింహారెడ్డి అక్రమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని మంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ బదిలీ చేయించారు. ఇక అన్నదమ్ముళ్లిద్దరూ నియోజకవర్గ పోలీసు వ్యవస్థను మొత్తం గుప్పిట పెట్టుకుని పెత్తనం చెలాయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాగజ్‌నగర్‌రూరల్‌ పరిధిలో ఉన్న ఓ బ్రాందీ షాపు ఏజెన్సీ కింద నోటిఫైడ్‌ కాగా దీన్నుంచి మహారాష్ట్రకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ ఈ సోదరుల అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇవేకాక అమాయకుల భూములను కబ్జా చేయడం, ప్రతీ పనుల్లో వాటాలు లేకపోతే పోలీసులతో బెదిరించి అట్రాసిటీ కేసులు పెట్టించడం షరామామూలుగా మారింది. ఇక్కడ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపైనా కేసులు పెట్టించారు. ఇప్పటికీ పలువురు పట్టణ విలేకరులు కేసులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే సంబంధీకులే అధికంగా రోడ్డు పనులు, టెండర్లు పొందారు. ఏం జరగాలన్నా వారు చెప్పిందే వేదంగా పరిస్థితి తయారైంది. దీంతో సిర్పూర్‌లో పనిచేయాలంటే లొంగిఉన్న వారే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇలాంటి అక్రమ దందాలను అరికట్టేందుకు అప్పటి ఎస్పీ కల్మేశ్వర్‌ సింగనేవార్‌ ఓ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేసి గుట్కా, మట్కా, పీడీఎస్‌ బియ్యం, బెల్లం, మద్యం, నకలీ విత్తనాలను అడ్డుకున్నారు. అక్రమ కలప రవాణా చేసేందుకు వీల్లేకుండా చేశారు. దీంతో పూర్తిగా టాస్క్‌ఫోర్స్‌ను ఎత్తేయడమే గాక ఎస్పీని సైతం ఉన్నతాధికారులతో ఒత్తిడి తెచ్చీ మరీ బదిలీ చేయించారు.

పోడుతో రాజకీయం
గిరిజనులను ఆసరా చేసుకుని చాలా మంది రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ఆర్‌ఎఫ్‌ఆర్‌ పొందిన గిరిజనులు 12వేల మంది ఉంటే అంతకు రెట్టింపు సంఖ్యలో గిరిజన, గిరిజనేతరులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అటవీ అధికారులు ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో అక్రమంగా సాగు చేసిన వారిని గుర్తించి తొలగించే ప్రయత్నం చేస్తే ఇక్కడి ఓ నాయకుడు వచ్చి రాజకీయం చేస్తారు. దీంతో పోడు పూర్తిగా రాజకీయ అస్త్రంగా మారింది. ట్రాక్టర్లు సీజ్‌ చేసిప్పుడు విడిపించుకోవడంతో పాటు గిరిజనుల ముసుగులో అనేక మంది రాజకీయ నాయకులు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడి అక్రమ పట్టాలు కూడా పొందారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌ మహారాష్ట్రలోని ‘తాడోబా అభయారణ్యం టైగర్‌ కారిడార్‌’గా ఉండడంతో పాటు అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబందులు కూడా ఈ డివిజన్‌లో ఉండడంతో అటవీ అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కోసం 120 హెక్టార్లలో అడవులు పెంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే ప్రాంతంలో అనేక మంది పోడు వ్యవసాయం చేయడం వారికి రాజకీయ నాయకుల అండ ఉండడంతో మొక్కల పెంపకం క్లిష్టంగా మారుతోంది.

జిల్లాలో నిషేధాజ్ఞాలు
ఈ ఘటన తర్వాత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుమురంభీం జిల్లా పోలీసు శాఖ నిషేధాజ్ఞలు విధించింది. కోనేరు కృష్ణ, తన అనుచరుల అరెస్టు తర్వాత కొంత మంది పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకుని నిరసనలు తెలుపుతారని ప్రచారం జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా కృష్ణను అదుపులోకి తీసుకుని జైనూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

16 మందిపై కేసు నమోదు
అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడిన 16 మందిపై కేసు నమోదు చేశాం. దాడికి పాల్పడిన కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరుడు పోశం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. వీరితోపాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశాం. దాడిలో మరో 30–40 మంది ఉన్నారు. విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన నేపథ్యంలో సెక్షన్‌ 147, 148, 307, 353, 332, 427, ఆర్‌/డబ్ల్యూ 149 కింద కేసులు నమోదు చేశాం. 
మల్లారెడ్డి, కుమురంభీం జిల్లా ఎస్పీ 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కాని ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. అటవీశాఖ అధికారులపై ఎవరు దాడులు చేసినా సహించేది లేదన్నారు. 
ఇంద్రకరణ్‌ రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి

దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు
కాగజ్‌నగర్‌లో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఘటన విషయం తెలియగానే స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో తాను మాట్లాడానని, బాధ్యులెవరైనా సరే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు
– హోంమంత్రి మహమూద్‌ అలీ

మరిన్ని వార్తలు