దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు

3 Oct, 2019 10:47 IST|Sakshi
మొక్కను నాటి నాయకులను, ప్రజాప్రతినిధులను ఆదేశిస్తున్న మంత్రి ఈశ్వర్‌

రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌

సాక్షి, ధర్మారం(ధర్మపురి): దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు సృష్టించిందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ శివారులో వానరవనంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ గ్రామాలుగా  తీర్చిదిద్దేందుకు ‘30 రోజుల ప్రణాళిక’ను గ్రామగ్రామాన అమలు చేయటం జరుగుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం,  పరిశుభ్రత కార్యక్రమాలను ఆయా గ్రామాల పాలకవర్గాలతో పాటుగా అధికారులకు అప్పగించి ప్రభుత్వం పకడ్బందీగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు.

నాలుగేళ్లలో కోటి 50 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. కోతుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో వనారవనాన్ని ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను పెంచుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న కోతులు అడవిలోకి వెళతాయన్నారు. ఈ వనంలో 180 రకాల పండ్ల మొక్కలను నాటుతున్నామన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.

ఫొటోలకు పోజులివ్వటం కాదు.. 
‘మొక్కలను నాటి వెళ్ళి పోవటం కాదు.. పెట్టిన ప్రతి మొక్కను రక్షించాలి.. నేను మొక్కను నాటుతుంటే నా వెంట ఉంటూ నిలపడితే సరికాదు. నా వద్ద బెల్లం లేదు.’ అన్నారు. మంత్రి ఈశ్వర్‌ ఖిలావనపర్తి వానరవనంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు మొక్కను నాటిన తర్వాత సరిపడు మట్టి అందుబాటులో లేకపోవటంతో మంత్రికి కోపాన్ని తెప్పించింది. గుంతలు ఎందుకు తీయలేదని గ్రామస్తులను ప్రశ్నించారు.

తాను వెళ్లిన తర్వాత ఇంతే సంగతా అని అనుమానం వ్యక్తం చేశారు.    కేసీఆర్‌ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదని ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలన్నారు. ఎంపీపీ  కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్‌ కనకతార, ఎంపీటీసీ  సుజాత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు  జితేందర్‌రావు, నాయకులు  బలరాంరెడ్డి, రాజేశం, రాజయ్య,  బుచ్చిరెడ్డి, మల్లేశం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు