హాట్‌టాపిక్‌గా డీఎస్పీ వ్యవహారం!

27 Mar, 2020 13:32 IST|Sakshi

కలకలం రేపుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ఇదే కేసులో వరంగల్‌ ఎంజీఎంలో 21 మందికి పరీక్షలు

అందరికీ నెగెటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

వరంగల్‌ అర్బన్‌, కాజీపేట అర్బన్‌ : కొత్తగూడెం డీఎస్పీ, ఆయన కుమారుడి వ్యవహారం ఇటు పోలీసులు, అటు ప్రజల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో వివిధ స్థాయిల్లో పని చేసిన సదరు డీఎస్పీ కుమారుడు(23)తో పాటు ఆ కుటుంబంతో సంబంధం ఉన్న మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విదివితమే. ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంటూ సుమారు 21 మందికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అయితే, 21 మందిలో ఎవరికీ కూడా పాజిటివ్‌ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా డీఎస్పీ కుమారుడు తిరిగిన ప్రదేశాలు, ఆయన పాల్గొన్న పంక్షన్లలో కలిసిన స్నేహితులు, బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఎంజీఎం, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రులకు తరలించడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అసలేం జరిగింది....
కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తూ ఈనెల 18న హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి వెళ్లారు. అయితే, యువకుడిని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో క్వారంటైన్‌ చేయకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈనెల 19న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల రాఘవపురంలోని ఒక గహప్రవేశానికి వెళ్లి అదే రోజు తల్లాడ మండలం మిట్టపల్లికి వెళ్లి బంధువులను కలిశాడు. ఈ మేరకు 21వ తేదీన అనారోగ్యంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా 22న కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తమైన అధికారులు.. 23న ఆయన కుటుంబ సభ్యులను, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది, వారితో కలిసిన సుమారు 21 మందిని మొదటగా వరంగల్‌ ఎంజీఎంకు తీసుకొచ్చి పరీక్షలు చేశాక నెగెటివ్‌ రావడంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇదే సమయంలో డీఎస్పీ, వారి కుటుంబసభ్యులకు ఈనెల 24న పరీక్షలు నిర్వహించగా.. డీఎస్పీతో పాటు వారి వంట మనిషికి పాజిటివ్‌గా నివేదిక రావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కాగా, సదరు డీఎస్పీ వివిధ స్థాయిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేయగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు